ఒప్పందానికి తలొగ్గకుంటే దాడులు తప్పవు.
* ఇరాన్‌కు అమెరికా రక్షణ మంత్రి తీవ్ర హెచ్చరిక.
*అవసరమైతే ‘బాంబులతోనే చర్చలు’.
* ఉచ్చు బిగిస్తున్న ట్రంప్ సర్కార్.
వాషింగ్టన్, మహా.
అణు కార్యక్రమంపై అమెరికా ప్రతిపాదించిన ఒప్పందాన్ని ఇరాన్ తక్షణమే అంగీకరించాలని, లేనిపక్షంలో ఆ దేశంపై సైనిక దాడులు కొనసాగుతాయని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అవసరమైతే తాము ‘బాంబులతోనే చర్చలు జరుపుతాం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రకమైన చర్యల్లో తమకంటే మెరుగైన వారు ప్రపంచంలోనే ఎవరూ లేరని ఇరాన్‌కు గట్టి సంకేతాలు పంపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కొత్త అణు ఒప్పందాన్ని అంగీకరించి శాంతియుత మార్గాన్ని ఎంచుకునేందుకు ఇరాన్‌కు ఇంకా అవకాశం ఉందని హెగ్సెత్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఇరాన్ చర్చల ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తమ దౌత్యపరమైన ప్రయత్నాలకు మద్దతుగా, ఇరాన్‌ను లొంగదీసుకునేందుకు అవసరమైన పరిస్థితులను సృష్టించడమే లక్ష్యంగా ప్రస్తుత సైనిక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.
ఇరాన్‌తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలు సజావుగా సాగేలా అమెరికా పటిష్ట చర్యలు చేపట్టిందని రక్షణ మంత్రి వెల్లడించారు. అమెరికా నౌకాదళ భద్రత మధ్య ఇప్పటివరకు 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురు రవాణా జరిగిందని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఇరాన్ రేవులకు వెళ్లే, లేదా అక్కడి నుంచి బయలుదేరే దాదాపు 140 నౌకలను అమెరికా దళాలు అడ్డుకున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో తాము జరిపిన సైనిక చర్యల వల్ల ఇరాన్ నౌకాదళం, వైమానిక దళంతో పాటు ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా బలహీనపడ్డాయని హెగ్సెత్ వివరించారు.
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, ఇరాన్ సంక్షోభాన్ని ముగించేందుకు ఇప్పటికీ సమయం మించిపోలేదని హెగ్సెత్ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఒప్పందాలు కుదర్చడంలో అత్యంత నిపుణుడని, ఇరాన్ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడం ఆ దేశానికే మంచిదని హితవు పలికారు. అలా కాకుండా మొండిగా ముందుకు వెళ్తే మాత్రం భవిష్యత్తులో మరింత తీవ్రమైన లక్ష్యిత సైనిక దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.








