రుణాల పరుగులో మిలీనియల్స్ ముందంజ.
* దూసుకొస్తున్న జెన్-జీ.
* ఈఎంఐలతోనే కలల సాకారం.
* చిన్న రుణాలపై జెన్-జీ ఆసక్తి.
ఢిల్లీ, మహా.
భారతదేశంలో రుణాల మార్కెట్ స్వరూపం వేగంగా మారుతోంది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల విస్తరణ, సులభ వాయిదా (ఈఎంఐ) పద్ధతులు అందుబాటులోకి రావడంతో అప్పుల పట్ల ప్రజల దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఆకాంక్షలు, జీవన వ్యయాల నడుమ సొంతిల్లు, కారు లాంటి కలలను సాకారం చేసుకునేందుకు నేటి తరం పెద్ద ఎత్తున రుణాల బాట పడుతోంది. ఈ క్రమంలో ‘బ్యాంక్‌బజార్’ విడుదల చేసిన తాజా నివేదిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో రుణాలు తీసుకుంటున్న వారిలో మిలీనియల్స్ (1981-1996 మధ్య జన్మించిన వారు) అగ్రస్థానంలో ఉండగా, వారితో దాదాపు సమానంగా జెన్-జీ (యువ తరం) పోటీ పడుతోంది.
# ఈఎంఐలతోనే కలల సాకారం
కొత్తగా అప్పులు చేస్తున్న వారిలో అత్యధిక వాటా మిలీనియల్స్ దేనని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నివేదిక ప్రకారం, 2025 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో కొత్తగా రుణాలు తీసుకున్న వారిలో మిలీనియల్స్ వాటా అత్యధికంగా 55.2 శాతంగా నమోదు కాగా, జెన్-జీ 54.7 శాతం, పాత తరం వారు 53.9 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలతో పాటు క్రెడిట్ కార్డుల వినియోగంలోనూ మిలీనియల్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కెరీర్‌లో స్థిరపడటం, కుటుంబ బాధ్యతలు పెరగడం, ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు ఆకాశాన్నంటడం వంటి కారణాలతో వీరు రుణాలను ప్రధాన ఆర్థిక సాధనంగా మలచుకుంటున్నారు. ఏళ్ల తరబడి పొదుపు చేసి ఆస్తులు కొనుగోలు చేయాలనే పాత తరహా ఆలోచనల నుంచి బయటపడి, ఈఎంఐల ద్వారా తమ అవసరాలను త్వరితగతిన తీర్చుకునేందుకు వీరు మొగ్గుచూపుతున్నారని బ్యాంక్‌బజార్ రిస్క్ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ సింగ్ విశ్లేషించారు. అప్పును చివరి అస్త్రంగా కాకుండా, ఒక సాధారణ సాధనంగా వారు భావిస్తున్నారని పేర్కొన్నారు.
#చిన్న రుణాలపై జెన్-జీ ఆసక్తి
ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్న జెన్-జీ తరం కూడా క్రెడిట్ మార్కెట్లోకి వేగంగా అడుగుపెడుతోంది. ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ, చెల్లింపుల సౌలభ్యం, తక్షణ నగదు అవసరాల కోసం వీరు క్రెడిట్ కార్డులు, చిన్న తరహా వ్యక్తిగత రుణాలను ఆశ్రయిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇతర తరాలతో పోలిస్తే జెన్-జీలో రుణాల చెల్లింపుల విషయంలో ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి కనిపించడం లేదు. అయితే, వీరు తీసుకుంటున్నవి చిన్న మొత్తాలు కావడమే ఇందుకు కారణమని, భవిష్యత్తులో గృహ రుణాలు వంటి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నప్పుడే వీరి చెల్లింపుల ప్రవర్తనపై స్పష్టత వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే దశాబ్ద కాలంలో యువత ఆదాయాలు పెరిగేకొద్దీ రిటైల్ రుణాల వృద్ధికి జెన్-జీ వారే కీలక చోదకులుగా మారతారని సంస్థ సీఈఓ అధిల్ శెట్టి అంచనా వేశారు.
# ఆస్తులపై రుణాలకు పెద్దల ప్రాధాన్యం
యువత ఆలోచనా ధోరణికి పూర్తి భిన్నంగా పాత తరం వారు వ్యవహరిస్తున్నారు. వీరు వ్యక్తిగత రుణాల కంటే, తమ వద్ద ఉన్న ఆస్తుల ఆధారంగా రుణాలు తీసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీకే రుణాలు పొందుతూ ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ విధానం వల్ల తమ సంపదను కాపాడుకోగలుగుతున్నారు.
మొత్తంగా చూస్తే, సులభతర రుణ లభ్యత దేశ ఆర్థిక ప్రగతికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి దోహదపడుతున్నప్పటికీ.. యువతపై మోయలేని విధంగా పెరుగుతున్న రుణభారం పట్ల కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అప్పుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.








