Mahaa Daily Exclusive

  హార్ముజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్…

Share

హార్ముజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.
* సంచలన విషయాలు వెల్లడించిన ట్రంప్.
* 100 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలింపు.
* ఇరాన్‌కు ఇప్పుడే తెలిసిందన్న అగ్రరాజ్యాధినేత.
ఢిల్లీ, మహా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో తమ దేశ సైన్యం ఒక భారీ రహస్య ఆపరేషన్ నిర్వహించిందని ప్రకటించారు. గత నెలలో అత్యంత గోప్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా ఏకంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురును సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించామని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ గురించి ఇరాన్‌కు ఇప్పుడే తెలిసిందని ఆయన పేర్కొన్నారు. తమ తాజా చర్యతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూశామని ట్రంప్ వివరించారు.
బుధవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడిన అనంతరం ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఈ ఆపరేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను పంచుకున్నారు. గత నెలలో హ‌ర్మూజ్ జలసంధి గుండా ఆయిల్ ట్యాంకర్లు, ఇతర వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేందుకు పూర్తి భద్రత కల్పించాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రయత్నం ద్వారా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు జలసంధిని దాటి బహిరంగ మార్కెట్‌కు చేరుకుందని, అలాగే సుమారు 200కు పైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 85-90 డాలర్ల వద్దే నిలకడగా ఉండటానికి ఈ రహస్య ఆపరేషనే కారణమని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఆంక్షల వల్ల చమురు సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని, మిషన్‌ భద్రత దృష్ట్యానే ఈ విషయాన్ని ఇంతకాలం అత్యంత గోప్యంగా ఉంచామని వెల్లడించారు. ప్రపంచ ఇంధన సరఫరాలో ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హ‌ర్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, గ్యాస్‌లో సుమారు 20 శాతం ఇక్కడి నుంచే వెళ్తుంది.
గత కొంతకాలంగా అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ తీసుకుంటున్న చర్యలతో ఈ ప్రాంతంలో నౌకాయానానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. ఇటీవల ఈ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీనికి ప్రతీకారంగా అమెరికా సైతం ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసింది. ఈ తరుణంలో ఇరాన్ దారితప్పి ప్రవర్తిస్తే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తప్పవని ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయితే, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఒకవైపు దౌత్యపరమైన ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ‘రహస్య ఆపరేషన్’ ప్రకటనపై అమెరికా వర్గాల నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇది పూర్తిగా కొత్త విషయం ఏమీ కాదని, గతంలో ప్రకటించిన విధంగా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే సాధారణ చర్యల్లో భాగమేనని ఓ సీనియర్ సైనిక అధికారి ‘న్యూయార్క్ టైమ్స్‌’తో పేర్కొన్నారు. అలాగే, ఇరాన్ చమురు రవాణా కార్యకలాపాల గురించి తనకేమీ తెలియదని అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ సైతం వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ చేసిన ఈ తాజా ప్రకటనపై ఇరాన్ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు.