Mahaa Daily Exclusive

  తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్‌….

Share

తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్‌.
*హైదరాబాద్ ఇక్కట్లపై సీఎం రేవంత్‌ను నిలదీసిన కేటీఆర్.
*పాలనను గాలికొదిలేసి రాజకీయాలపైనే దృష్టి పెట్టారని విమర్శ.
హైదరాబాద్, మహా.
నైరుతి రుతుపవనాల రాకతో భాగ్యనగరంలో కురిసిన తొలి భారీ వర్షానికే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షానికే నగరం అతలాకుతలం కావడంపై ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో నెలకొన్న దుస్థితిపై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.
మున్సిపల్ శాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నగర ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నరకయాతన అనుభవిస్తున్నా కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం రాకముందే ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ పథకాల ద్వారా నాలాల పూడికతీత, వ్యర్థాల తొలగింపు తదితర పనులను పక్కా ప్రణాళికతో సమీక్షించేవాళ్లమని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కనీస చర్యలను పూర్తిగా గాలికొదిలేయడం వల్లే వర్షం పడిన వెంటనే రోడ్లన్నీ జలమయమయ్యాయని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక ఇంజిన్‌ లాంటి హైదరాబాద్ ప్రగతిని రేవంత్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ దుయ్యబట్టారు. పరిపాలనను పక్కనబెట్టి కేవలం రాజకీయాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ఆక్షేపించారు. వర్షం పడగానే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, విద్యుదాఘాతాల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ముందస్తు సన్నద్ధత ఎక్కడ ఉందని ఈ సందర్భంగా నిలదీశారు.
ప్రజా సమస్యల పరిష్కారాన్ని వదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు వ్యతిరేకంగా త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు. వానాకాలం ప్రారంభంతోనే తలెత్తిన ఈ పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వేడిని మరింత పెంచాయి.