Mahaa Daily Exclusive

  విద్యా, వైద్యమే దేశ ప్రగతికి ప్రాణవాయువు…

Share

విద్యా, వైద్యమే దేశ ప్రగతికి ప్రాణవాయువు.
*నీతి ఆయోగ్ వేదికగా తెలంగాణ అభివృద్ధి.
* నమూనాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి*
*మెట్రో రెండో దశకు కేంద్రం పచ్చజెండా.
* హైదరాబాద్‌కు ఐఐఎం, నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి.
*దేశాభివృద్ధి ఇంజిన్లైన ఆరు మహానగరాలకు ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని కేంద్రానికి కీలక ప్రతిపాదన.
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా రాష్ట్ర అభివృద్ధికి కీలక అడుగులు వేశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అనుమతులపై ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇదే క్రమంలో ఉన్నత విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌కు జాతీయ స్థాయి సంస్థ అయిన ‘ఐఐఎం’ను మంజూరు చేయాలని, అలాగే రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి అవసరమైన అనుమతులు, నిధులు త్వరితగతిన మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. మూసీ నది పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణాలకు ఆర్థిక దన్ను అందించాలని, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశం ముందుంచారు. కేంద్రం నిర్దేశించిన ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఆర్థిక వనరులు మాత్రమే సరిపోవని, ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించినప్పుడే అది సాధ్యపడుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ సర్వే) నివేదికను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలోని 242 కులాలకు చెందిన సుమారు 3.55 కోట్ల మంది వివరాలను విశ్లేషించగా, కేవలం డబ్బు, భూమి లేకపోవడం కంటే ‘నాణ్యమైన విద్య’కు దూరం కావడమే సామాజిక వెనుకబాటుతనానికి ప్రధాన కారణమని తేలిందని ముఖ్యమంత్రి సభాముఖంగా వెల్లడించారు.
ఈ అసమానతలను రూపుమాపేందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సకల సౌకర్యాలతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నామని, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని వర్గాల పిల్లలు ఒకేచోట కలిసి చదువుకోవడం ద్వారా సమాజంలో కుల వివక్షకు చెక్ పెట్టవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, పౌష్టికాహారంతో కూడిన ఈ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఉన్నతాధికారులైనా తమ రాష్ట్రంలోని ఈ పాఠశాలలను సందర్శించడానికి వస్తే సంతోషంగా స్వాగతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాకుండా, కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో యువతను ప్రపంచస్థాయి పోటీకి సన్నద్ధం చేసేలా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజుల భాగస్వామ్యంతో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునికీకరించేందుకు టాటా సంస్థతో రూ.2,100 కోట్లతో చారిత్రక పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లారు.
‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా 2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అగ్రగామిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశ ఆర్థికాభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్న ప్రధాన నగరాల అభివృద్ధికి ఆయన ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) పర్యవేక్షణలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాల కోసం ప్రత్యేకంగా ‘ఎం-6 (మెగా-6) టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఆరు నగరాల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఒక్కో నగరానికి లక్ష కోట్ల చొప్పున మొత్తం రూ.6 లక్షల కోట్లతో ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.