Mahaa Daily Exclusive

  కమలంపై షర్మిల కన్నెర్ర….

Share

కమలంపై షర్మిల కన్నెర్ర..
* రాజ్యసభ’ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధిష్ఠానానికీ చురకలు!
విజయవాడ, మహా.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరుగుతూనే, మరోవైపు పరోక్షంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘రాజ్యసభ సీటు’ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఏపీ కాంగ్రెస్‌లో కొత్త కలకలానికి దారితీస్తున్నాయి.
**అధిష్ఠానంపై అసహనమా?**
తనకు రాజ్యసభ సీటు దక్కకపోవడంపై బీజేపీ చేసిన విమర్శలకు షర్మిల దీటుగా బదులిచ్చారు. రాజ్యసభ సీటు అనేది మాట ఇచ్చిన వాళ్లకు, తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయమని, మధ్యలో బీజేపీకి ఈ అతి స్పందన ఎందుకని ఆమె ప్రశ్నించారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ హైకమాండ్‌కు ఒక స్పష్టమైన సందేశం ఉందన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పెద్దల సభకు పంపుతామని ఏఐసీసీ నాయకత్వం ఆమెకు హామీ ఇచ్చి మాట తప్పిందా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నేడు ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ కీలక సమావేశానికి షర్మిల దూరంగా ఉండటం, అలాగే ‘పుండు మీద కారం చల్లొద్దు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల పార్టీ కార్యక్రమాల పట్ల ఆమె కొంత అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం వెనుక ఉన్న ఆంతర్యం అధిష్ఠానం పట్ల ఉన్న అసంతృప్తేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
**బీజేపీకి 12 సూటి ప్రశ్నలు..**
మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. గడచిన 12 ఏళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచారు. అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం మాని, ధైర్యం ఉంటే తాను లేవనెత్తిన 12 వైఫల్యాలపై సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. నిత్యావసరాల ధరలు 300 శాతం మేర ఎందుకు పెరిగాయో, ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎందుకు పాతాళానికి పడిపోయిందో కేంద్రం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
యువత, మహిళల భద్రత విషయంలోనూ కేంద్రం తీరును షర్మిల ఎండగట్టారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని, దేశవ్యాప్తంగా 28 సార్లు పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించారు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలను గుర్తు చేస్తూ.. ఏటా ఐదు లక్షల అఘాయిత్యాలు జరుగుతుంటే సాధికారత గురించి ఎలా మాట్లాడతారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీఎం కిసాన్ నిధులు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్న కేంద్రం, ఏటా 12 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. దేశంలో మౌలిక వసతులు కల్పించామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు, తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మతాల మధ్య చిచ్చుపెట్టి, ఎన్నికల సంఘం (ఈసీ) లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను కీలుబొమ్మలుగా మార్చుకుని ఓట్లు, సీట్లు కొల్లగొడుతున్న బీజేపీకి ప్రజాభిమానం ఎక్కడుందని ఆమె ఎద్దేవా చేశారు. మొత్తంగా ఒకే ఒక ట్వీట్‌తో షర్మిల అటు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు, ఇటు సొంత పార్టీ అధిష్ఠానానికి సైతం తన అసంతృప్తిని తెలియజేసిన తీరు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.