మామిడి పండు తినాలంటేనే భయమేస్తోంది!
*రసాయనాలతో విషతుల్యంగా మారుతున్న ఆహారం.
* హైదరాబాద్లో పాలు తాగి ఆసుపత్రి పాలయ్యా.
*యూరియా దిగుమతుల కోసమే విదేశాలకు రూ.1.20 లక్షల కోట్లు.
*సేంద్రియ సాగుతోనే ఆరోగ్యంతో పాటు సిరులు.
*కిసాన్ మోర్చా సమ్మేళనంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
జమ్మికుంట,మహా.
దేశంలో ప్రస్తుతం మామిడికాయ తినాలంటేనే ప్రజలు భయపడే దయనీయ పరిస్థితి నెలకొందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘ప్రకృతి వ్యవసాయం – రైతు సమ్మేళనం’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాల వినియోగంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో రసాయనాలతో పండించిన మామిడి పండ్లు తిని ఇద్దరు చనిపోయారని, స్వయంగా తాను సైతం నగరంలో పాలు తాగి మూడు రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఇరవై ఏళ్లలో తనకు కనీసం జ్వరం, దగ్గు రాలేదని, బీపీ, షుగర్ లాంటి సమస్యలు లేవన్న ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే తన ఆరోగ్యానికి స్ఫూర్తి అని స్పష్టం చేశారు. రోగాలకు కారకులం మనమేనని, వాటిని నివారించుకునే బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉందని ఉద్ఘాటించారు.
**సేంద్రియ సాగుతో కోటీశ్వరులు కావచ్చు**
ప్రస్తుతం మన భూములన్నీ రసాయన ఎరువులతో నిండిపోయాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం తక్షణమే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే తొలి రెండు, మూడు ఏళ్లు ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోయినా.. ఆ తర్వాత కచ్చితంగా రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారని, ఈ అవకాశాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలకు తగిన మద్దతు ధర లభించేలా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కనీసం 25 వేల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు.
**రైతులకు ఎకరానికి రూ.4 వేల ప్రోత్సాహకం**
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా బడ్జెట్లో ‘జాతీయ కృషి యోజన’ కింద ఏకంగా రూ.2,400 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. సేంద్రియ సాగు చేసే ప్రతి రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామని వెల్లడించారు. కోటి మందిని లక్ష్యంగా చేసుకుని, దేశవ్యాప్తంగా 30 వేల క్లస్టర్ల ద్వారా 30 లక్షల మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో.. వారు ఆ పొలంలో దిగిన సెల్ఫీని పంపిస్తే స్వయంగా తానే వారిని సన్మానిస్తానని మంత్రి ప్రకటించారు.
**విదేశాలకు తరలుతున్న నిధులు**
దేశంలో ఎరువుల వినియోగంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం యూరియా కొనుగోళ్ల కోసమే ఏటా బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, ఇందులో రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనం విదేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోవడానికే సరిపోతోందని, ఇది ఎంతో బాధాకరమైన విషయమని అన్నారు. అలాగే బంగారం, చమురు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్ల కోసం మన దేశ సంపద విదేశాలకు తరలిపోతోందని వివరించారు. ఈ పరిస్థితిని మార్చి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతోనే ప్రధాని మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.








