మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి!
*విషాదం నింపిన పండ్ల ఆరగింపు.. ఆసుపత్రిలో మరో బాలిక.
*లోతైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశం.
హైదరాబాద్, మహా.
మామిడి పండ్లు తిన్న ఓ కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురై, రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వరుస మరణాలు ఆ కుటుంబంలో తీరని శోకాన్ని, స్థానికంగా తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. ఈ కలకలం రేపిన ఘటనపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. బాలికల మరణాలకు గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నారాయణగూడ ఎస్ఐ సాయి సందీప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన ఇందుమతి తన ఐదుగురు కుమార్తెలతో కలిసి హైదరాబాద్‌లోని నారాయణగూడ విఠల్‌వాడిలో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త బీదర్‌లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇందుమతి ఇంటికి రేణుక అనే బంధువు వస్తూ తనతో పాటు మామిడి పండ్లను తీసుకువచ్చారు. ఆ పండ్లను కుటుంబ సభ్యులంతా కలిసి ఆరగించారు. అయితే, మరుసటి రోజు ఉదయం నుంచే తల్లీకుమార్తెలకు విపరీతమైన వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. పరిస్థితి విషమించడంతో స్థానికుల సాయంతో వెంటనే వారిని కాచిగూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ 17 ఏళ్ల వయసున్న భువనేశ్వరి సోమవారం కన్నుమూసింది. ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు తేరుకోకముందే, పదేళ్ల వయసున్న మరో కుమార్తె సంధ్యారాణి సైతం మంగళవారం తుదిశ్వాస విడిచింది. మరో బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స పొందుతోంది. బంధువులు తెచ్చిన మామిడి పండ్లు తిన్న తర్వాతే తామంతా తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని బాధిత కుటుంబ సభ్యులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడికాయల్లోని రసాయనాల వల్లే ఈ అనర్థం జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో ముమ్మర విచారణ చేపట్టారు.
ఇద్దరు చిన్నారుల వరుస మృతికి దారితీసిన పరిస్థితులపై సీపీ సజ్జనార్ ప్రత్యేక దృష్టి సారించారు. మృతిచెందిన బాలికల అంతర్గత అవయవాల (విసేరా) నమూనాలను కచ్చితంగా భద్రపరచాలని, అలాగే వైద్య నిపుణుల అభిప్రాయాలను సేకరించాలని దర్యాప్తు అధికారులను ఆయన ఆదేశించారు. విసేరా నివేదికలు, శాస్త్రీయ ఆధారాలు, వైద్యుల రిపోర్టుల ఆధారంగా కేసును లోతుగా విచారించి, మరణాలకు గల కచ్చితమైన కారణాలను వెలికితీస్తామని కమిషనర్ సజ్జనార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.








