Mahaa Daily Exclusive

  దేశ ప్రగతికి విద్యా, వైద్యమే మూలస్తంభాలు!.

Share

దేశ ప్రగతికి విద్యా, వైద్యమే మూలస్తంభాలు!.
*నీతి ఆయోగ్ వేదికగా తెలంగాణ అభివృద్ధి.
* నమూనాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
*ఆరు మహానగరాల అభివృద్ధికి ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’..
* నగరానికి లక్ష కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలి*
*‘తెలంగాణ రైజింగ్’తో 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం.
*హైదరాబాద్‌కు ఐఐఎం, మెట్రో రెండో దశకు కేంద్రం సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి.
ఢిల్లీ, మహా.

దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నా, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యం సాకారం కావాలన్నా ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచడమే బలమైన పునాది అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని, పౌరులను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన తర్వాత తెలంగాణ అనుసరిస్తున్న వినూత్న అభివృద్ధి నమూనాను ఆయన నీతి ఆయోగ్ వేదికగా దేశం ముందుంచారు.
**ఆరు మహానగరాలకు ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’**
దేశ ఆర్థిక ప్రగతికి ప్రధాన చోదక శక్తులుగా (ఇంజన్లుగా) ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కీలక ప్రతిపాదన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) పర్యవేక్షణలో ఈ ఆరు నగరాల కోసం ప్రత్యేకంగా ‘ఎం-6 (మెగా-6) టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆయన పునరుద్ఘాటించారు. ఈ మహానగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోటి చొప్పున మొత్తం రూ.6 లక్షల కోట్లతో ఒక ప్రత్యేక నిధిని కేటాయించాలని కేంద్రానికి సూచించారు. ఇదే వేదికగా తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన పలు ప్రాజెక్టులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడంతో పాటు, జాతీయ విద్యాసంస్థ ఐఐఎం ను హైదరాబాద్‌కు మంజూరు చేయాలని విన్నవించారు.
**సామాజిక వెనుకబాటుకు ‘విద్య’ లేమి ప్రధాన కారణం**
తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే లోని కీలక అంశాలను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా 242 కులాలకు చెందిన 3.55 కోట్ల మంది పౌరుల వివరాలను ఈ సర్వే ద్వారా సేకరించినట్లు తెలిపారు. ప్రజల సామాజిక వెనుకబాటుతనానికి కేవలం ఆర్థిక స్థితిగతులు, భూమి లేకపోవడం కంటే.. ‘విద్య’కు దూరం కావడమే ప్రధాన కారణమని ఈ సర్వేలో స్పష్టంగా వెల్లడైందన్నారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోగలమన్న ఉద్దేశంతో, విద్యాశాఖను ముఖ్యమంత్రిగా తన వద్దే ఉంచుకుని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. గడచిన 75 ఏళ్లలో ఉచిత విద్యను అందించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా, నాణ్యమైన విద్యను అందించడం ఒక సవాలుగా మిగిలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
**కులాల గోడలు కూల్చే ‘యంగ్ ఇండియా స్కూల్స్’**
ఈ పరిస్థితులను మార్చి రాష్ట్రంలో విద్యా విప్లవం తీసుకురావడానికే ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధన, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, బస్సు సౌకర్యంతో పాటు క్రీడా మైదానాలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో కుల వివక్షను రూపుమాపి, సమానత్వం పెంపొందించే దిశగా ప్రతి నియోజకవర్గంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని వర్గాల పిల్లలు ఒకే క్యాంపస్‌లో చదువుకుని, కలిసి జీవించడం ద్వారా వారి మధ్య కులాల గోడలు కూలిపోతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఉన్నతాధికారులైనా తెలంగాణలోని ఈ మోడల్ స్కూల్స్‌ను సందర్శించడానికి వస్తే సంతోషంగా స్వాగతిస్తామని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
**నైపుణ్యాభివృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం**
కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో యువతకు ఆధునిక నైపుణ్యాలు ఎంతో అవసరమని, ఇందుకోసం ప్రపంచస్థాయి శిక్షణను అందించేలా ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి వారు దీని నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. అలాగే టాటా టెక్నాలజీస్ సంస్థ పెట్టబోయే రూ.2,100 కోట్ల పెట్టుబడి, సహకారంతో రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. తయారీ, సేవా రంగాల్లో భారీ ఉపాధి కల్పన కోసమే గ్రీన్ ఎనర్జీ, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా 2034 నాటికి రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు తెలంగాణ ఒక కేంద్రంగా మారిందన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను రాష్ట్రానికి రప్పించే క్రమంలో, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం తొలి విజయమని పేర్కొన్నారు. ఈ విద్యా హబ్‌కు అనుబంధంగా ‘ఐఐఎం’ ఆవశ్యకతను వివరించారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.