ఎట్టకేలకు సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్.
* సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ సీఎస్‌గా నియామకం.
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్.
అమరావతి, మహా.
రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పోస్టింగ్ ఖరారు చేసింది. సాధారణ పరిపాలన శాఖ (జీపీఎం అండ్ ఏఆర్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమెను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయిప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా వివిధ కీలక శాఖల్లో పనిచేసిన అపార అనుభవం ఉన్న శ్రీలక్ష్మి సేవలను పరిపాలనా సంస్కరణల విభాగంలో పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు ఈ జీపీఎం అండ్ ఏఆర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) విభాగానికి సీనియర్ అధికారి శంషేర్ సింగ్ రావత్ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజా నియామకంతో ఆయన్ను ఆ అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ, ఆ స్థానంలో శ్రీలక్ష్మికి పూర్తిస్థాయి పర్యవేక్షణను ప్రభుత్వం అప్పగించింది. దీంతో సాధారణ పరిపాలన శాఖలోని పలు కీలక పరిపాలనా వ్యవహారాలు ఇకపై ఆమె కనుసన్నల్లోనే సాగనున్నాయి. కొంతకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆమెకు కీలకమైన బాధ్యతలు దక్కడం రాష్ట్ర అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.







