Mahaa Daily Exclusive

  గుజరాత్‌లో ఉగ్ర కుట్ర భగ్నం…..

Share

గుజరాత్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.
* జైషే మాడ్యూల్‌కు చెందిన ఐదుగురు అరెస్ట్
అహ్మదాబాద్, మహా.
గుజరాత్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన కేసులో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలో భారీ ఉగ్రదాడులకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఈ మాడ్యూల్‌ను ముందుగానే గుర్తించి భగ్నం చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితులు పేలుళ్లకు అవసరమైన శిక్షణ, నిధులు, ఆయుధాల వినియోగంపై విస్తృతంగా సిద్ధమైనట్లు దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.
ఏటీఎస్ తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టయిన ఐదుగురిలో ఇద్దరు జమ్మూకశ్మీర్‌కు వెళ్లి ప్రత్యేక ఉగ్ర శిక్షణ పొందారు. ఏకే-47 అసాల్ట్ రైఫిల్ వినియోగంతో పాటు పేలుడు పదార్థాల తయారీ, విషవాయువుల వినియోగం సహా దాదాపు 40 రకాల ఉగ్ర నైపుణ్యాల్లో శిక్షణ పొందినట్లు విచారణలో వెల్లడైంది. సాధారణ సేంద్రియ పదార్థాలతో అత్యంత ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును తయారు చేసే విధానాలను కూడా వారు నేర్చుకున్నట్లు అధికారులు తెలిపారు.
విదేశాల్లో ఉన్న అబ్దుల్లా అనే హ్యాండ్లర్ ఆదేశాల మేరకే ఈ ఉగ్ర మాడ్యూల్ కార్యకలాపాలు కొనసాగినట్లు ఏటీఎస్ గుర్తించింది. గుజరాత్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు నిందితులు వడోదరకు వెళ్లి ఓ కశ్మీరీ యువకుడిని సంప్రదించినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొంది. భవిష్యత్ ఉగ్రకార్యకలాపాలకు అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్లలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇప్పటికే ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల పరీక్షలు నిర్వహించినట్లు ఏటీఎస్ వెల్లడించింది. పరీక్షల అనంతరం సోడియం ఫాస్ఫేట్, వైర్లు తదితర సామగ్రిని చెత్తకుండీల్లో పడేసినట్లు గుర్తించి, వాటిని ఫోరెన్సిక్ బృందాలు స్వాధీనం చేసుకుని శాస్త్రీయ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
విదేశీ హ్యాండ్లర్ నుంచి సుమారు రూ.3 లక్షల నిధులు అందుకున్న నిందితులు ఓ కారు, ద్విచక్రవాహనాన్ని కొనుగోలు చేసి లక్ష్య ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని ఒక గార్డెన్ తరహా హోటల్‌ను ప్రధాన లక్ష్యంగా ఎంచుకుని పేలుళ్లకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు. హోటల్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న సమయంలోనే ఏటీఎస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని భారీ కుట్రను భగ్నం చేసినట్లు వెల్లడించారు.
నిందితుల స్థావరాలపై నిర్వహించిన సోదాల్లో 43 జిహాదీ పుస్తకాలు, డిజిటల్ మాన్యువల్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ తెలిపింది. ఖడియాసన్‌లోని ఓ మదర్సాలో ప్రధాన నిందితుడు అమీన్ షేరా యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించేందుకు ఈ పుస్తకాలను ఉపయోగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. విదేశీ ఉగ్ర సంస్థలతో సంబంధాలు, నిధుల లావాదేవీలు, స్థానికంగా సహకరించిన వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అనంతరం నిందితులను మెహసానా జిల్లా కడి కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ చేపట్టారు.