Mahaa Daily Exclusive

  రౌడీయిజానికి తావులేదు….

Share

రౌడీయిజానికి తావులేదు.
* ప్రజల జీవితాలతో ఆడుకుంటే సహించం: సీఎం చంద్రబాబు.
గుడివాడ,మహా.
రాష్ట్రంలో రౌడీయిజం, నేరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, అమృత్ 2.0 పథకం కింద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, స్వర్ణ పంచాయతీ ఉద్యోగులకు స్వచ్ఛ అవార్డులు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు నేరాలను రాజకీయాలుగా మార్చుకున్నారని విమర్శించారు. మాజీ మంత్రి కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ, ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. పోస్టర్లు, కటౌట్ల కోసం జంతువులను బలి ఇవ్వడం వంటి సంఘటనలు సభ్య సమాజానికి మచ్చ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజల సంక్షేమం కంటే దోపిడీకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని, ఇకపై చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాలుష్యం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్న సీఎం, స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అక్టోబర్ 2 నాటికి చెత్తరహితంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు.
అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ, పట్టిసీమ నిర్మాణాన్ని గతంలో చాలామంది వ్యతిరేకించినప్పటికీ కేవలం 12 నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరు అందించామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 450 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అని పేర్కొంటూ, పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు.
భవిష్యత్తులో రాష్ట్రంలోని నదుల అనుసంధానాన్ని పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆక్వా రంగంతో పాటు పొగాకు రైతులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.