కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే యువ సంగ్రామ సదస్సు.
• బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సరూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, యువతను నమ్మించి మోసం చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే ఈ సభను నిర్వహించామని అన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క అయితే ఇకపై మరో లెక్క ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
సరూర్‌నగర్ స్టేడియమే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, చేసిన మోసాలకు ప్రత్యక్ష సాక్ష్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగ యువతను నయవంచనకు గురి చేశారని ఆరోపించారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి హామీలు ఇచ్చారని, రాష్ట్ర నాయకులు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చలేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లకు బదులుగా అవినీతి, అక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. అశోక్‌నగర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన హామీలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయని, తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం అర్థం చేసుకోలేకపోతోందని అన్నారు.
ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తున్న యువతపై పోలీసులతో లాఠీచార్జీలు చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేసుకున్న ప్రభుత్వం, ఉద్యోగాల భర్తీలో మాత్రం ఎలాంటి పురోగతి చూపలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేయకుండా రాజకీయ ప్రచారానికే పరిమితమయ్యారని, ఎన్నికల హామీలపై ప్రజలు ప్రశ్నిస్తే వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారానే ప్రస్తుతం నియామకాలు జరుగుతున్నాయని, వాటికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలని చూస్తోందని కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చి, 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో భూములు, ఇసుక, ఇతర సహజ వనరుల దోపిడీ పెరిగిందని ఆరోపించిన కేటీఆర్, కాంగ్రెస్ పాలనలో అవినీతి విస్తరిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు అధికారిక నోటిఫికేషన్లు చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాలను విడిచిపెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాబోయే రోజుల్లో యువతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతుందని, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ మరింత బలంగా పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.







