Mahaa Daily Exclusive

  ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల.

Share

హైదరాబాద్, మహా.
ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలు ఉమ్మడిగా ముందుకు రావాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు లేఖ రాసిన ఆయన, కేంద్ర ప్రభుత్వంపై సంయుక్తంగా ఒత్తిడి తీసుకువచ్చి ఆయిల్ పామ్ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించాలని విజ్ఞప్తి చేశారు.
ఆయిల్ పామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు కలిసి సమావేశం కావాలని తుమ్మల ప్రతిపాదించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా ఆయిల్ పామ్ తాజా పండ్ల గెలలకు కనీస మద్దతు ధరను టన్నుకు రూ.25 వేలుగా నిర్ణయించాలని కేంద్రాన్ని కోరారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ప్రస్తుతం తగ్గించిన క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని మళ్లీ 44 శాతానికి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
దిగుమతి సుంకాల తగ్గింపు కారణంగా విదేశాల నుంచి తక్కువ ధరకు పామ్ ఆయిల్ దిగుమతులు పెరిగి, దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా రైతులకు సరైన ధర లభించడం లేదని, దీంతో ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
దేశంలో ఆయిల్ పామ్ సాగులో దాదాపు 75 శాతం విస్తీర్ణం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉందని తుమ్మల పేర్కొన్నారు. అందువల్ల ఈ రాష్ట్రాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి రైతుల ప్రయోజనాల కోసం కేంద్రాన్ని కోరితే సమస్యల పరిష్కారం వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
దేశాన్ని వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ముందుగా ఆయిల్ పామ్ రైతులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు స్థిరమైన ఆదాయం లభించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని తగిన విధాన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఆయిల్ పామ్ రైతుల భవిష్యత్తును కాపాడేందుకు దక్షిణాది రాష్ట్రాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఏకమై పోరాడాల్సిన సమయం వచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.