Mahaa Daily Exclusive

  కల్తీ పై ఉక్కుపాదం…

Share

కల్తీ పై ఉక్కుపాదం.
* తెలంగాణలో కఠిన చట్టానికి ప్రభుత్వం సిద్ధం
* టోల్‌ఫ్రీ నంబర్, విజిల్‌బ్లోయర్ వ్యవస్థ ఏర్పాటు.
* ప్రజల ఆరోగ్య రక్షణకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.

హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కల్తీ ఆహారం, నకిలీ ఔషధాల తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. హైదరాబాదులో శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కల్తీల నియంత్రణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై రాజీలేని చర్యలు తీసుకునేలా సమగ్ర చట్టానికి రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కల్తీ ఆహారం, నకిలీ మందుల కారణంగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కల్తీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చేరవేసేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే వారికి రక్షణ కల్పించే విధంగా విజిల్‌బ్లోయర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు దానిపై సమగ్ర చర్చ నిర్వహించి, ప్రజల అభిప్రాయాలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది రూపం ఇవ్వాలని అధికారులకు సూచించారు.
కల్తీ నియంత్రణలో ప్రపంచంలోని పలు దేశాలు అమలు చేస్తున్న చట్టాలు, విధానాలను అధ్యయనం చేసి, వాటిలో ఉత్తమమైన పద్ధతులను తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ‘క్యూర్’ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ వ్యవస్థను అమలు చేసి, ఫలితాలను సమీక్షించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
సేంద్రియ ఉత్పత్తులకు విశ్వసనీయత కల్పించేందుకు ప్రత్యేక ధృవీకరణ వ్యవస్థను రూపొందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రసాయన అవశేషాలు, కల్తీ కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతోందని సీఎం పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యత ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు.
ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, కల్తీ ఆహారం, నకిలీ ఔషధాల తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై ఇకపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో కల్తీ రహిత తెలంగాణ సాధించే దిశగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు.