హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు షాక్.
* రెండో లాటరీ ఉండదన్న యూఎస్‌సీఐఎస్
వాషింగ్టన్, మహా.
అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం హెచ్-1బీ వీసాపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది విదేశీ ఉద్యోగార్థులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసాల కోసం రెండో లాటరీ నిర్వహించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుత కోటా భర్తీకి అవసరమైన హెచ్-1బీ పిటిషన్లు ఇప్పటికే అందినందున అదనపు లాటరీ అవసరం లేదని వెల్లడించింది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం సాధారణ కేటగిరీ కింద 65 వేల హెచ్-1బీ వీసాలు, అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసిన అభ్యర్థుల కోసం అడ్వాన్స్‌డ్ డిగ్రీ మినహాయింపు కింద మరో 20 వేల వీసాలను మంజూరు చేస్తుంది. ఈ రెండు విభాగాలకు అవసరమైన దరఖాస్తులు ఇప్పటికే అందడంతో ఎంపిక ప్రక్రియ పూర్తయిందని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
ఈసారి తొలిసారిగా వేతన ఆధారిత విధానంలో హెచ్-1బీ ఎంపిక ప్రక్రియ నిర్వహించడం విశేషం. గత సంవత్సరాలతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,43,981 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, 2027 ఆర్థిక సంవత్సరానికి అవి 2,11,600కు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతమంది విశ్లేషకులు రెండో లాటరీ నిర్వహించే అవకాశం ఉందని భావించినప్పటికీ, యూఎస్‌సీఐఎస్ ఆ అంచనాలకు తెరదించింది.
సాధారణంగా హెచ్-1బీ లాటరీలో ఎంపికైన రిజిస్ట్రేషన్ల ఆధారంగా యజమాని సంస్థలు పూర్తి వివరాలతో ఫీజుతో కూడిన పిటిషన్లను సమర్పిస్తాయి. వాటిలో గణనీయమైన సంఖ్యలో పిటిషన్లు తిరస్కరణకు గురైతే లేదా కోటా పూర్తికాకపోతే మాత్రమే రెండో దశ లాటరీ నిర్వహిస్తారు. అయితే ఈసారి కోటాకు అవసరమైన సంఖ్యలో చెల్లుబాటు అయ్యే పిటిషన్లు అందినందున రెండో లాటరీ నిర్వహించే అవసరం లేదని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
ఈ ప్రకటనతో రెండో లాటరీపై ఆశలు పెట్టుకున్న వేలాది మంది విదేశీ ఉద్యోగార్థులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు నిరాశ ఎదురైంది.







