Mahaa Daily Exclusive

  నేరాలకు కూడా ‘రోజుకూలీ’….

Share

నేరాలకు కూడా ‘రోజుకూలీ’.
* యువతను ఉచ్చులోకి లాగుతున్న ముఠాలు.

హైదరాబాద్, మహా.
ఒకప్పుడు హత్యలు, కిడ్నాప్‌లు వంటి తీవ్ర నేరాలకు మాత్రమే ‘సుఫారీ’ ఇచ్చే ముఠాలు ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. చైన్ స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్ చోరీలు, ద్విచక్రవాహనాల దొంగతనాలు, భూదందాలు, బెదిరింపులు, గుంపులుగా వెళ్లి గొడవలు సృష్టించడం వంటి నేరాలకు కూడా యువతకు రోజువారీ కూలీ చెల్లిస్తూ నేర సామ్రాజ్యాలను విస్తరిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్‌తో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాత నేరస్థులు తెరవెనుక ఉండి ఈ ముఠాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ప్రతి నేరానికి ప్రత్యేకంగా కూలీ నిర్ణయిస్తారు. పనితీరు, అనుభవం ఆధారంగా పారితోషికం పెంచడంతో పాటు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసిన వారికి ముఠాలో నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగిస్తున్నట్లు గుర్తించారు. డబ్బు ఆశతో నిరుద్యోగ యువతను, మైనర్లను కూడా ఈ ముఠాల్లో చేర్చుకుని నేరాలకు పాల్పడేలా ప్రలోభపెడుతున్నారని అధికారులు చెబుతున్నారు.
బిహార్‌కు చెందిన ఓ యువకుడు అక్కడి ముఠా సూచనల మేరకు వరంగల్‌లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి దోచుకున్న బంగారు ఆభరణాలను ముఠా సభ్యులకు అప్పగిస్తూ కమీషన్ తీసుకునేవాడని పోలీసులు గుర్తించారు. అనంతరం అదే అనుభవంతో కొంతమంది యువకులను సమీకరించి సొంతంగా చోరీల ముఠా ఏర్పాటు చేసిన అతడిని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ హత్య కేసు దర్యాప్తులో కూడా ఇదే తరహా అంశాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితురాలు కల్పన డబ్బు ఇస్తామని ఆశ చూపడంతోనే నేరానికి సహకరించినట్లు ఇద్దరు సహ నిందితులు విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గోల్కొండ జోన్ పరిధిలోని ఓ బస్తీని కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న కొన్ని ముఠాలు తెలుగు రాష్ట్రాల్లో జరిగే భారీ సభలు, ఉత్సవాలు, ఊరేగింపులను లక్ష్యంగా చేసుకుని సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక ముఠాలో నలుగురు లేదా ఐదుగురు సభ్యులు ఉన్నప్పటికీ, అసలు చోరీ ఒక్కరే చేస్తారని, మిగిలిన వారు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు కూలీతో పాటు భోజనం కోసం వెంట వెళ్లే సహాయకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో చోరీ చేసి తప్పించుకునే విధానాలపై వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు.
చోరీ చేసిన సెల్‌ఫోన్లకు సైబర్ నేరగాళ్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, వ్యభిచార ముఠాల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడే వారికి రోజుకు రూ.5 వేల వరకు కూలీ చెల్లిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఓల్డ్ సిటీ, నగర శివారు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాల చోరీలకు మైనర్లను వినియోగిస్తున్నట్లు కూడా గుర్తించారు.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నలుగురు యువకులను ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్‌కు రప్పించి, టోలిచౌకిలో వసతి కల్పించిన తర్వాత రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు చోరీ చేసి తెస్తే ఒక్కో ఫోన్‌కు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు చెల్లిస్తామని ప్రలోభపెట్టిన ఘటనను పోలీసులు వెలుగులోకి తెచ్చారు. మరో ఘటనలో మేడ్చల్‌కు చెందిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్‌కు వేసవి సెలవుల్లో రోజుకు రూ.2 వేల కూలీ, భోజనం ఇస్తామని చెప్పి భూదందా కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రలోభపెట్టిన కేసును కూడా పోలీసులు నమోదు చేశారు.
డబ్బు ఆశ చూపించి యువతను నేరాల బాట పట్టించే ఈ కొత్త ధోరణిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిరుద్యోగులు, మైనర్లు ఇలాంటి ముఠాల ప్రలోభాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.