Mahaa Daily Exclusive

  బినామీలపై ఐటీ శాఖ ఉక్కుపాదం…

Share

బినామీలపై ఐటీ శాఖ ఉక్కుపాదం.
* అవినీతి అధికారుల అక్రమాస్తులపై మరో అస్త్రం.
* వందల కోట్ల అక్రమ సంపద జప్తుకు రంగం సిద్ధం.

హైదరాబాద్, మహా.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వెలుగులోకి వస్తున్న వందల కోట్ల రూపాయల అక్రమ సంపదపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తుల్లో బయటపడుతున్న బినామీ ఆస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఐటీ శాఖ, బినామీ లావాదేవీల (నిషేధ) చట్టం-1988 కింద చర్యలు చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఏసీబీ కేసుల్లో నిందితులపై మాత్రమే విచారణ పరిమితమవుతుండగా, ఇకపై వారి బినామీల పేర్లలో ఉన్న ఆస్తులను కూడా గుర్తించి జప్తు చేసే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న అక్రమాస్తులు అధికార వ్యవస్థలో అవినీతి స్థాయిని మరోసారి బయటపెడుతున్నాయి. నగదు, బంగారం, ఖరీదైన విల్లాలు, అపార్ట్‌మెంట్లు, ఎకరాల కొద్దీ వ్యవసాయ భూములు, వాణిజ్య స్థలాలు, ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు ఇలా మార్కెట్ విలువ ప్రకారం వందల కోట్ల రూపాయల ఆస్తులు ఒక్కో కేసులో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ ఆస్తుల్లో గణనీయమైన భాగం నిందితుల పేర్లలో కాకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు లేదా ఇతర వ్యక్తుల పేర్లలో నమోదు చేసినట్లు దర్యాప్తుల్లో తేలుతోంది.

ఇటీవల ఏసీబీ కేసులో పట్టుబడిన డీఎస్పీ భీంరెడ్డి వ్యవహారం దీనికి ప్రధాన ఉదాహరణగా మారింది. దర్యాప్తు ప్రకారం మార్కెట్ విలువ ప్రకారం ఆయనకు సంబంధించిన ఆస్తులు సుమారు రూ.200 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో 38 ఎకరాలు, మరోచోట 6 ఎకరాల భూమిని హోంగార్డు పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించిన అధికారులు, అతడిని బినామీగా అనుమానిస్తున్నారు. దర్యాప్తులో ఇలాంటి బినామీలు దాదాపు పది మందికి పైగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ పేరుతో ఆస్తులు కొనుగోలు చేయాలంటే శాఖాపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కొనుగోలు చేస్తే అవి అధికారిక రికార్డుల్లో నమోదయ్యే అవకాశం ఉండటంతో, చాలామంది అవినీతి అధికారులు బినామీల పేర్లలో పెట్టుబడులు పెట్టే మార్గాన్ని ఎంచుకుంటున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏసీబీ దర్యాప్తు ప్రధానంగా నిందితుడి అక్రమ ఆదాయంపైనే కేంద్రీకృతమవుతుండగా, బినామీల పేర్లలో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఆదాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తోంది.

బినామీ లావాదేవీల (నిషేధ) చట్టం-1988 ప్రకారం, వాస్తవ యజమాని కాకుండా ఇతరుల పేర్లలో కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేసే అధికారాలు ఆదాయపు పన్ను శాఖకు ఉన్నాయి. ఈ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా బినామీ లావాదేవీల నిరోధక విభాగం పనిచేస్తోంది. హైదరాబాద్ యూనిట్ పరిధిలోనే ప్రతి ఏడాది సుమారు 60 నుంచి 70 కేసులు నమోదవుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏసీబీ నమోదు చేస్తున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల వివరాలను ఐటీ శాఖ తెప్పించుకుంటున్నట్లు సమాచారం. దర్యాప్తులో బినామీ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభిస్తే, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి ఆస్తుల మూలాలను వివరించాలని కోరనుంది. సంతృప్తికరమైన ఆధారాలు సమర్పించలేకపోతే ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది.

గతంలో గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు. నయీం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేర్లలో ఉంచిన ఆస్తులను గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ, బినామీలకు నోటీసులు జారీ చేసి పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో అవినీతి అధికారులపై నమోదవుతున్న అక్రమాస్తుల కేసుల్లో కూడా బినామీ ఆస్తుల నిరోధక చట్టాన్ని ప్రయోగించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చర్యలు అమల్లోకి వస్తే అక్రమార్జన ద్వారా సంపాదించిన ఆస్తులను బినామీల పేర్లలో దాచిపెట్టి చట్టం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఈ అంశంపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు సంబంధిత వ్యక్తులపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తు పరిధిలోనే ఉన్న విషయాన్ని అధికారులు గుర్తుచేస్తున్నారు.