Mahaa Daily Exclusive

  ప్రశ్న రావణ్‌కు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్…

Share

ప్రశ్న రావణ్‌కు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
* దేశద్రోహం, యూఏపీఏ కేసుల్లో విచారణ కొనసాగింపు.

విజయవాడ, మహా.
దేశద్రోహం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లో అరెస్టై రిమాండ్‌లో ఉన్న ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్‌ను రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసుల కథనం ప్రకారం, జోసెఫ్ సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలు పోస్టు చేసి వాటిని వైరల్ చేశారనే ఆరోపణలతో తొలుత ఆయనపై కేసులు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేసి ఆయన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపినట్లు అధికారులు తెలిపారు.

మొబైల్ ఫోన్ విశ్లేషణలో లభించిన డిజిటల్ ఆధారాల ఆధారంగా, నిషేధిత మావోయిస్టు సంస్థ సిద్ధాంతాలను సమర్థించేలా వీడియోలు రూపొందించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ ఆధారాల నేపథ్యంలో కేసులో అదనపు సెక్షన్లు చేర్చి, దేశద్రోహం ఆరోపణలతో పాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా పోస్టులు, ఇతర సాంకేతిక సమాచారాన్ని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మరోవైపు, జోసెఫ్‌పై నమోదైన ఆరోపణలపై తుది నిర్ణయం విచారణ పూర్తై, న్యాయస్థానం తీర్పు వెలువడిన అనంతరమే తేలనుంది.