Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ తుగ్లక్ పాలనపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలి.:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

Share

 

హైదరాబాద్, మహా.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని ప్రజా పోరాటాలు చేపట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం అన్ని జిల్లాల్లో పార్టీ కార్యవర్గ సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని రాంచందర్ రావు తెలిపారు. మల్కాజిగిరి జిల్లా ప్రస్తుతం బీజేపీకి బలమైన కేంద్రంగా మారిందని, పాత, కొత్త కార్యకర్తల సమన్వయంతో ప్రజల మద్దతు పెరిగిందని పేర్కొన్నారు. ఎంపీ స్థానంతో పాటు పలు కార్పొరేటర్ స్థానాలను గెలుచుకోవడం పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనల నేపథ్యంలో మల్కాజిగిరి కీలక ప్రాంతంగా మారిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించిన ఆయన, ముఖ్యంగా మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మాట వినే పరిస్థితిలో లేదని, నిరంతర ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికీ పూర్తి స్థాయి హోంశాఖ, విద్యాశాఖ, న్యాయశాఖ మంత్రులు లేకపోవడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని రాంచందర్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రే ఈ కీలక శాఖలను తన వద్ద ఉంచుకోవడంతో పాలన గందరగోళంగా మారిందని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల్లో అభద్రతా భావం పెరిగిందని పేర్కొన్నారు.

హైడ్రా వ్యవహారంపై కూడా ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. పేదల ఇళ్లను కూల్చడంలో చురుకుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అక్రమ నిర్మాణాల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలపై చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని డిమాండ్ చేశారు.

విద్యా రంగంపై మాట్లాడిన రాంచందర్ రావు, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి భారీ నిధులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం వాటిని విడుదల చేయలేదని ఆరోపించారు. బీసీ హాస్టళ్లలో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఉద్యోగ నియామకాల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని ఆరోపించారు. గ్రూప్-1 సహా పలు పోటీ పరీక్షలు వివాదాలకు గురవుతున్నాయని, నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు.

వ్యవసాయ రంగం, తాగునీటి సమస్యలపైనా ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. పట్టణాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు.

ధరణి, హైడ్రా, హెచ్‌ఎండీఏ వంటి వ్యవస్థల పనితీరుపై కూడా విమర్శలు చేసిన రాంచందర్ రావు, రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఆకాంక్ష ప్రజల్లో పెరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాటాలు ఉధృతం చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.