Mahaa Daily Exclusive

  బహదూర్‌గూడ రైతుల భూముల అంశంపై బీజేపీ ఆందోళన…అరెస్టులను ఖండించిన రాంచందర్ రావు.

Share

హైదరాబాద్, మహా.
శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో మెట్రో, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల కోసం భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు, బీజేపీ నాయకుల అరెస్టులను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మెట్రో, బుల్లెట్ ట్రైన్ వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులకు బీజేపీ గానీ, రైతులు గానీ వ్యతిరేకం కాదని రాంచందర్ రావు అన్నారు. అయితే సాగులో ఉన్న సారవంతమైన వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకునే ముందు రైతులకు సరైన ప్రత్యామ్నాయం కల్పించడం, చట్టబద్ధమైన ఫెయిర్ కంపెన్సేషన్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. అలాంటి చర్యలు చేపట్టకుండా భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయడం అన్యాయమని ఆరోపించారు.

భూముల సేకరణ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించడం, కంచెలు ఏర్పాటు చేసి రైతులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, బీజేపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవడం సరైంది కాదన్నారు.

రైతుల తరఫున ఆందోళనలో పాల్గొన్న బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, జిల్లా ఇన్‌చార్జి సేవెళ్ల మహేందర్, సీనియర్ నాయకుడు తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రాంచందర్ రావు తెలిపారు. రాజ్ భూపాల్ గౌడ్‌ను శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు, సేవెళ్ల మహేందర్‌తో పాటు మరికొందరిని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

అరెస్టు చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూములు కోల్పోతున్న రైతులతో ప్రభుత్వం చర్చలు జరిపి వారికి న్యాయమైన పరిహారం, తగిన ప్రత్యామ్నాయాన్ని కల్పించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను బీజేపీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరిని వీడి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.