మహిళా సాధికారతకు ప్రభుత్వం పూర్తి సహకారం.
• మహిళా పారిశ్రామికవేత్తలకు కొత్త పారిశ్రామిక పార్క్‌పై పరిశీలన.
• సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా.
మహిళా సాధికారతను రాష్ట్ర అభివృద్ధికి కీలక శక్తిగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఫిక్కీ మహిళా విభాగం ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం హైదరాబాద్‌లోని శిల్పారామం సమీపంలో వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఎఫ్‌ఎల్‌వో ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎఫ్‌ఎల్‌వో స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి సంస్థ కార్యక్రమాలను వివరించారు. అలాగే 2027లో ఫిక్కీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై కూడా చర్చించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైటెక్ సిటీ, సీఐఐ కార్యాలయం మధ్యలో ఎఫ్‌ఎల్‌వో ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ద్వారా ఆ ప్రాంతం వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని అన్నారు. మహిళల నాయకత్వంలో వ్యాపార రంగం మరింత బలోపేతం కావాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు.
ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీ కూడా భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఫిక్కీ ప్రధాన కార్యాలయ నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఫార్చూన్–500 కంపెనీలను ఆకర్షించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న మహిళల పారిశ్రామిక పార్క్‌ను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, అదే తరహాలో మరో మహిళా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలపడిన దేశాల్లో ఆర్థికాభివృద్ధి వేగంగా జరిగి, ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని అన్నారు.
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యలు, అవసరాలపై చర్చిస్తామని తెలిపారు. వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలకు ఎఫ్‌ఎల్‌వో ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ప్రత్యేక అవార్డులు అందజేసి గౌరవించాలని కూడా ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, ఎఫ్‌ఎల్‌వో జాతీయ అధ్యక్షురాలు పూజా గార్గ్, ఎఫ్‌ఎల్‌వో హైదరాబాద్ చైర్‌పర్సన్ సీతా రెడ్డి గడ్డం తదితరులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.








