“తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టం”.
• కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు”.
• నోటిఫికేషన్లు మీవి.. ఉద్యోగాలు మావి”.
• బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఘాటు విమర్శ.
హైదరాబాద్, మహా.
తెలంగాణను దోచుకున్నవారిని చట్టం ముందు నిలబెడతామని, ప్రజల సంపదను దుర్వినియోగం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అణచివేయాలని ప్రయత్నించిన శక్తులు చివరకు ప్రజల తీర్పుతో చరిత్రలో కలిసిపోయాయని ఆయన అన్నారు.
శనివారం ప్రజాకవి అందెశ్రీ స్మృతివనం భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, తెలంగాణ ఉద్యమం, నిరుద్యోగ యువత, రైతులు, ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి కుటుంబ పాలన సాగించిందంటూ బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ప్రజల్లోకి రాకుండా అడ్డుకునేందుకు అప్పటి పాలకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని సీఎం అన్నారు. పెన్నులపై మట్టికప్పినా అవి గున్నులై మొలకెత్తినట్లే, ప్రజాకవుల స్వరాన్ని ఎంత అణచివేయాలని చూసినా అది మరింత బలంగా ప్రజల్లో మారుమోగిందని పేర్కొన్నారు. అందెశ్రీ, గద్దర్ వంటి ప్రజా గొంతుకలను నిర్బంధించేందుకు ప్రయత్నించిన పాలకులు ప్రజల తీర్పుతో రాజకీయంగా కనుమరుగయ్యారని వ్యాఖ్యానించారు.
తెలంగాణను ఒక కుటుంబ ఆస్తిలా భావించి పాలించారని బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి అధికారాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకే పరిమితం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పదవుల్లో కూర్చోబెట్టడం, బంధువులకు కీలక బాధ్యతలు అప్పగించడం తప్ప నిరుద్యోగ యువత భవిష్యత్తుపై ఒక్కరోజైనా ఆలోచించలేదని మండిపడ్డారు.
ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ ఇచ్చారు. “నోటిఫికేషన్లు ఇచ్చింది మీరైతే… ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వం” అని పేర్కొంటూ, నోటిఫికేషన్లు ప్రకటించి ప్రశ్నపత్రాల లీకులతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను అయోమయంలోకి నెట్టారని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగిన యువత కన్నీళ్లను పట్టించుకోకుండా పాలన సాగించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తమ ప్రభుత్వం దాదాపు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి మాట నిలబెట్టుకుందని తెలిపారు.
గత పాలనలో తెలంగాణను భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం ఆరోపించారు. రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, అదే సమయంలో కొందరు అపార ఆస్తులు కూడబెట్టారని విమర్శించారు. సాధారణ స్థితి నుంచి విలాసవంతమైన జీవితానికి చేరుకున్న వారు తమ ఆస్తులపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.
గత ప్రభుత్వం నిరుద్యోగం, అవినీతి, కుటుంబ పాలనతో తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీసిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆస్తులు, హక్కులు, భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం రాజీపడదని, రాష్ట్రాన్ని దోచుకున్నవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.








