Mahaa Daily Exclusive

  అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి కానుక. రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకం.

Share

హైదరాబాద్, మహా.

సినీ అభిమానులను ఎప్పుడూ తన కుటుంబ సభ్యులుగా భావించే మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అరుదైన కానుక అందబోతోంది. ఎన్నో ఏళ్లుగా చిరంజీవిపై అభిమానంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అఖిల భారత చిరంజీవి యువత ద్వారా సామాజిక సేవలో పాల్గొంటున్న సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా సహకారం అందించనున్నట్లు సమాచారం.

అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 22న చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసారి చిరంజీవి జన్మదినోత్సవాలను ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా చిరంజీవి అభిమాన సంఘాలతో అనుబంధం కొనసాగిస్తూ, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సీనియర్ అభిమానులను ప్రత్యేకంగా గుర్తించి వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీలు అందజేయనున్నట్లు రవణం స్వామి నాయుడు తెలిపారు.

ఈ బీమా పథకం అమలును ముందుగా గుంటూరు జిల్లాలో ప్రారంభించి, అనంతరం దశలవారీగా ఇతర జిల్లాల అభిమానులకు కూడా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. అభిమానుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ చేపడుతున్న ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా చిరంజీవి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

అభిమానుల సేవలను గుర్తించి వారి ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక బీమా పథకాన్ని అందించడం సినీ రంగంలో అరుదైన నిర్ణయంగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి జన్మదినోత్సవాల సందర్భంగా ప్రకటించిన ఈ కార్యక్రమం అభిమాన సంఘాల సంక్షేమానికి కొత్త దిశగా నిలవనుందని భావిస్తున్నారు.