ఖార్గ్ ద్వీపంపై అమెరికా అడుగుపెడితే తీవ్ర పరిణామాలు.
* ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఘాటు హెచ్చరిక.
* హోర్ముజ్‌పై తమ వైఖరి మారదని స్పష్టీకరణ
టెహ్రాన్, మహా.
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దేశ చమురు ఎగుమతులకు జీవనాడిగా భావించే ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా తిప్పికొడతామని, అలాంటి చర్యలకు అమెరికా ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి మాట్లాడుతూ, ఇరాన్‌పై అమెరికా భూతల దండయాత్రకు దిగితే తమ బలగాలు మాత్రమే కాకుండా ఆ ప్రాంత ప్రజలు కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడి చేయడం అమెరికాకు అత్యంత ఖరీదైన నిర్ణయంగా మారుతుందని, దాని పర్యవసానాలకు పూర్తిగా వాషింగ్టన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో బుషెహర్ ప్రావిన్స్‌లో ఉన్న ఖార్గ్ ద్వీపం ఆ దేశ ఇంధన రంగానికి కీలక కేంద్రంగా ఉంది. ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ద్వీపం ద్వారానే జరుగుతుండటంతో దీనికి అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ఈ ద్వీపంపై నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావచ్చని అమెరికా భావిస్తున్నప్పటికీ, అలాంటి చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
అమెరికాతో కుదిరిన మధ్యంతర ఒప్పందంపై కూడా ఇరాన్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఒప్పందంలోని 14 నిబంధనలపై ఎలాంటి సందిగ్ధత లేదని, వాటిని అన్ని పక్షాలు తప్పనిసరిగా పాటించాలని ఇస్మాయిల్ బఘేయి పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత ఇరాన్‌కే ఉంటుందని మొదటి నుంచే చెబుతున్నామని, ఈ అంశంపై ఒమన్‌తో పాటు ప్రాంతీయ దేశాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని వెల్లడించారు.
దౌత్యపరమైన ఒప్పందాలకు అమెరికా కట్టుబడి ఉండాలని, ఇప్పటికే కుదిరిన అవగాహనలను ఉల్లంఘించేందుకు ఎలాంటి సాకులు వెతకరాదని బఘేయి హెచ్చరించారు. ఒప్పందం స్పష్టంగా ఉన్నందున దానిని అమలు చేయాల్సిన బాధ్యత అన్ని పక్షాలపైనా సమానంగా ఉందన్నారు.
ఇదిలా ఉండగా, ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు ప్రస్తావించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ అమెరికా ఆ ద్వీపంపై నియంత్రణ సాధిస్తే ఇరాన్ చమురు ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఏర్పడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే అలాంటి సైనిక చర్య అమెరికాకు కూడా తీవ్ర నష్టాలను మిగిల్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశముండటంతో ప్రపంచ దేశాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.








