Mahaa Daily Exclusive

  విద్యార్థుల నిరసనలపై ఇన్‌స్టా పోస్ట్‌తో వివాదం…

Share

విద్యార్థుల నిరసనలపై ఇన్‌స్టా పోస్ట్‌తో వివాదం.
* ఏఆర్‌ఎఫ్ అధికారి సోనియా షెహ్రావత్‌పై విమర్శలు.
* విధి నిర్వహణలో గాయపడ్డానంటూ అధికారిణి వివరణ.
ఢిల్లీ, మహా.
విద్యార్థుల నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఏఆర్‌ఎఫ్) అసిస్టెంట్ కమాండెంట్ సోనియా షెహ్రావత్‌ను వివాదంలోకి నెట్టింది. నిరసనకారులను ఉద్దేశిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీయగా, విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పోస్టును ఆమె వెంటనే తొలగించారు.

హరియాణాకు చెందిన సోనియా షెహ్రావత్ సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అధికారిణిగా గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఆరు లక్షలకు పైగా అనుచరులు ఉన్నారు. విధి నిర్వహణకు సంబంధించిన అంశాలతో పాటు వ్యక్తిగత జీవితం, ప్రయాణాలు, వ్యాయామం, ఆధ్యాత్మికతకు సంబంధించిన పోస్టులను తరచూ పంచుకుంటుంటారు.

ఇటీవల ఢిల్లీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనల సందర్భంగా విధుల్లో పాల్గొన్న సోనియా, తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చనిపోయిన బొద్దింక ఫొటోను షేర్ చేస్తూ “తమను తాము మార్చుకోలేని వారు దేశాన్ని మార్చాలనుకుంటున్నారు” అనే వ్యాఖ్యను జోడించారు. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సీజేపీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, శాంతియుత నిరసనకారులను బొద్దింకలతో పోల్చడం అభ్యంతరకరమని పేర్కొంది. వివాదం మరింత ముదరడంతో సోనియా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని తొలగించారు.

ఈ ఘటనతో కేంద్ర భద్రతా బలగాల సేవా నిబంధనలపై కూడా చర్చ ప్రారంభమైంది. విధి నిర్వహణలో ఉన్న అధికారులు రాజకీయ వ్యాఖ్యలు చేయరాదని, వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో యూనిఫాంలో ఉన్న ఫొటోలను వినియోగించకూడదని నిబంధనలు సూచిస్తున్న నేపథ్యంలో, సోనియా చేసిన పోస్ట్ ఆ నిబంధనలకు విరుద్ధమా అనే అంశంపై చర్చ సాగుతోంది.

అయితే తన వైఖరిని సోనియా షెహ్రావత్ సమర్థించుకున్నారు. విద్యార్థుల నిరసనల పేరుతో కొందరు అసాంఘిక శక్తులు చొరబడి పోలీసులపై రాళ్లు, గాజు సీసాలు, చెప్పులతో దాడి చేశారని ఆమె ఆరోపించారు. మహిళలను రక్షించే ప్రయత్నంలో తన చేతికి గాయమైందని, మెడపై గోళ్లతో గీసిన గాయాలను కూడా మీడియాకు చూపిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు ఆ పరిస్థితుల నేపథ్యంలోనే వచ్చాయని వివరణ ఇచ్చారు.