Mahaa Daily Exclusive

  నీట్ సహా అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధం….బిజెపి ఎంపీ కె. లక్ష్మణ్.

Share

నీట్ సహా అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధం….బిజెపి ఎంపీ కె. లక్ష్మణ్.
ఢిల్లీ, మహా.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంతో పాటు అన్ని కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్లమెంట్ సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా ప్రతిపక్షాలు వ్యవహరించడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీరును ఈ సందర్భంగా ఆయన తీవ్రంగా విమర్శించారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్టు చేసినట్లు లక్ష్మణ్ గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినప్పటికీ, ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.
విద్యార్థుల సమస్యలను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని సూచించారు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ పార్లమెంట్‌ను సమర్థవంతంగా నిర్వహించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్చలే సరైన వేదిక అని, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం కంటే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించాలని ప్రతిపక్షాలకు సూచించారు.