దుబాయ్ భారత కాన్సులేట్‌కు తొలి తెలుగు కాన్సుల్ జనరల్.
* విష్ణువర్ధన్ రెడ్డి నియామకం ఖరారు.
* దుబాయ్ చరిత్రలో తొలిసారి తెలుగు దౌత్యవేత్తకు అత్యున్నత బాధ్యతలు.
దుబాయ్, మహా.
ప్రపంచంలోనే అత్యంత కీలకమైన భారతీయ దౌత్య కేంద్రాల్లో ఒకటైన దుబాయ్ భారత కాన్సులేట్‌కు తొలిసారిగా ఓ తెలుగు దౌత్యవేత్త అత్యున్నత బాధ్యతలు చేపట్టనున్నారు. 2008 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవ (ఐఎఫ్‌ఎస్) అధికారి డాక్టర్ ఇమ్మడి విష్ణువర్ధన్ రెడ్డిని దుబాయ్ భారత కాన్సుల్ జనరల్‌గా నియమించనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడితే, దుబాయ్ కాన్సులేట్ అర్ధశతాబ్ద కాల చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారి అనే అరుదైన గౌరవం ఆయనకు దక్కనుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య విద్యను అభ్యసించిన అనంతరం భారత విదేశాంగ సేవలో చేరారు. విదేశాంగ రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన ఐరోపా, అమెరికా ఖండాల్లోని భారత మిషన్లతో పాటు ఐక్యరాజ్యసమితిలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల వరకు డిప్యూటేషన్‌పై తెలంగాణ ప్రభుత్వంలో పెట్టుబడులు, పరిశ్రమల వ్యవహారాలను పర్యవేక్షించగా, అంతకుముందు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిగా కూడా సేవలందించారు.
దాదాపు 40 లక్షల మంది భారతీయులు నివసిస్తూ, ఉపాధి పొందుతున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దుబాయ్ భారత దౌత్య పరంగా అత్యంత కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది. భారత విదేశీ వాణిజ్యంలోనూ యూఏఈ ప్రధాన భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా ఉండటంతో, దుబాయ్ కాన్సుల్ జనరల్ పదవికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
విష్ణువర్ధన్ రెడ్డి నియామకం అధికారికంగా ఖరారైతే, గల్ఫ్ దేశాల్లో అత్యున్నత భారతీయ దౌత్య పదవుల్లో పనిచేస్తున్న తెలుగు అధికారుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఫహాద్ ఖాన్ సూరి, ఖతార్‌లో కొప్పుల శ్రీకర్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒమాన్‌లో జి.వి. శ్రీనివాస్, సౌదీ అరేబియాలో డాక్టర్ ఔసాఫ్ సయీద్ వంటి భారతీయ దౌత్యవేత్తలు కూడా విశిష్ట సేవలందించారు.
దుబాయ్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన దౌత్య కేంద్రానికి తెలుగు అధికారి నియామకం కావడం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రవాస భారతీయుల్లోనూ ఆనందాన్ని నింపుతోంది. భారత–యూఏఈ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, అక్కడి భారతీయుల సంక్షేమం కోసం ఆయన సేవలు మరింత ఉపయోగపడతాయని దౌత్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.








