హరారే, మహా.
జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు అందుకోవడం జీవితంలో మరపురాని క్షణమని పేర్కొన్నాడు. ఈ ఘనతతో భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న ఆటగాడిగా వైభవ్ కొత్త చరిత్ర సృష్టించాడు.
సిరీస్ ముగిసిన అనంతరం బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన కల నెరవేరిందని, అంతర్జాతీయ స్థాయిలో తొలి సిరీస్‌లోనే వ్యక్తిగత అవార్డులు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. తనపై తనకు ఉన్న నమ్మకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నాడు.
జట్టుకు వేగవంతమైన ఆరంభం అందించడమే తన ప్రధాన లక్ష్యమని వైభవ్ వెల్లడించాడు. మంచి ఆరంభం లభించినప్పుడు దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. జింబాబ్వేలోని హరారేకు వచ్చిన తర్వాత రెండు, మూడు రోజుల పాటు జరిగిన సన్నాహక శిబిరం తనకు ఎంతో ఉపయోగపడిందని వివరించాడు.
అండర్-19 ప్రపంచకప్ సందర్భంగా హరారేలో ఇప్పటికే ఆడిన అనుభవం కూడా తనకు కలిసొచ్చిందని వైభవ్ పేర్కొన్నాడు. అక్కడి పరిస్థితులు, పిచ్ స్వభావం ముందే తెలిసి ఉండటంతో ధైర్యంగా బ్యాటింగ్ చేయగలిగానని చెప్పాడు.
జట్టు కెప్టెన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లు తనపై పూర్తి నమ్మకం ఉంచారని, వారి ప్రోత్సాహం తన ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని వైభవ్ వెల్లడించాడు. వారి సహకారం వల్లే ఒత్తిడిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేయగలిగానని అన్నాడు.
జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ రెండు అర్ధశతకాలతో ఆకట్టుకుని భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అదే ప్రదర్శనకు గుర్తింపుగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కించుకోవడంతో పాటు భారత క్రికెట్‌లో మరో యువ సంచలనంగా తన పేరును నమోదు చేసుకున్నాడు.








