దగ్గుబాటి సోదరులకు హైకోర్టులో ఎదురుదెబ్బ.
* క్రిమినల్ కేసు కొట్టివేతకు అంగీకరించని కోర్ట్.
* లీజు వివాదంలో విచారణ కొనసాగించాలని ఆదేశం.
హైదరాబాద్, మహా.
ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్తి లీజు వివాదానికి సంబంధించి వారి పేర్లపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కేసులో ప్రాథమికంగా క్రిమినల్ నేరాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నందున ఈ దశలో విచారణను నిలిపివేయడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని ఓ ఆస్తిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చిన అనంతరం తలెత్తిన వివాదం ఈ కేసుకు దారితీసింది. లీజు ఒప్పందం అమలులో ఉండగానే ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను తీసుకెళ్లడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు నందకుమార్ ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం నమోదైన కేసు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది.
తమపై నమోదు చేసిన కేసులో క్రిమినల్ నేరాలకు సంబంధించిన అంశాలు లేవని, ఇది పూర్తిగా సివిల్ స్వభావం కలిగిన వివాదమని పేర్కొంటూ సురేశ్‌బాబు, వెంకటేశ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఈ దశలో కేసును రద్దు చేసే పరిస్థితి లేదని స్పష్టం చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, దర్యాప్తు రికార్డులను పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు మెరిట్‌పై పూర్తి విచారణ అనంతరం దిగువ కోర్టు తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంటూ, ఈ దశలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో దగ్గుబాటి సోదరులు ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసు నాంపల్లి కోర్టులో యథావిధిగా కొనసాగనుంది.








