Mahaa Daily Exclusive

  చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవండి:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు

Share

ఢిల్లీ, మహా.

‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా దేశ ప్రజలందరూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 1905 ఆగస్టు 7వ తేదీన దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ‘స్వదేశీ ఉద్యమం’ ప్రారంభమైందని, ఈ చారిత్రక ఘట్టాన్ని మనం ఎప్పటికీ మరువకూడదని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో ప్రారంభమైన ఈ ఉద్యమమే నేటి ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత) దార్శనికతకు పునాది వేసిందని ఆయన స్పష్టం చేశారు. అప్పట్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా దేశవాసులంతా ఏకమై పెద్ద పోరాటమే చేశారని ప్రధాని పేర్కొన్నారు.
గత వారం దేశ ప్రజలందరూ ‘ఫ్రెండ్‌షిప్ డే’ (స్నేహితుల దినోత్సవం) ఎంత ఉత్సాహంగా జరుపుకున్నారో, అదే తరహా ఉత్సాహంతో ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’ కూడా జరుపుకోవాలని ప్రధాని కోరారు. చేనేత దినోత్సవం జరుపుకోవడం అంటే ప్రతి పేద నేతన్న కుటుంబానికి అండగా నిలవడమేనని ఆయన వివరించారు. తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న చిన్నపాటి మగ్గాలపై నేత కార్మికులు ఎంతో శ్రమించి, తమ చేతులతో అద్భుతమైన వస్త్రాలను సృష్టిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. మార్కెట్లో విభిన్న రకాల చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా యువతకు , సోషల్ మీడియా వినియోగదారులకు ప్రధాని ఒక ప్రత్యేక సూచన చేశారు. ప్రజలు చేనేత వస్త్రాలను ధరించి ‘గెట్ రెడీ విత్ మీ’ వంటి వీడియోలు రూపొందించి, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు. దేశంలోని పేద చేనేత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వావలంబన భారత్‌ను నిర్మించడమే మన లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక చేనేత ఉత్పత్తిని కొనుగోలు చేసి, దానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా మన నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.