జెన్ జీని గుడ్డిగా నమ్ముతా.
* నిరసన వారి ప్రజాస్వామ్య హక్కు.
* విద్యకు జీడీపీలో 6 శాతం నిధుల కేటాయింపు త్వరలోనే సాధ్యం!
* ఐఐఎమ్‌యుఎన్ వార్షికోత్సవంలో ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు.
ముంబయి, మహా.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు, యువత ఆలోచనా ధోరణి, ప్రజాస్వామ్య హక్కులు సహా పలు అంతర్జాతీయ, సామాజిక అంశాలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భాగవత్ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబయి వేదికగా నిర్వహించిన ఐఐఎమ్‌యుఎన్ 15వ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యా రంగానికి జీడీపీలో 6 శాతం నిధుల కేటాయింపు అతిత్వరలోనే సాధ్యమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన.. నేటి ‘జెన్ జీ’ విద్యార్థులకు నిరసన తెలిపే పూర్తి ప్రజాస్వామ్య హక్కు ఉందని స్పష్టం చేశారు. సమస్యలను ప్రశ్నించడం, మార్పును ఆకాంక్షించడం నేటి తరం నైజమని, అంతమాత్రాన వారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం ఎంతమాత్రం సరికాదని తేల్చిచెప్పారు.
విద్యా రంగాన్ని ఒక ఖర్చులా కాకుండా, దేశ భవిష్యత్తు కోసం చేసే అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడిగా చూడాలని భాగవత్ పిలుపునిచ్చారు. చదువు వ్యాపారంగా మారకూడదని, సమాజంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా విద్యా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. విద్యాభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, మొత్తం సమాజం కూడా ఇందులో భాగస్వామ్యం వహించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విద్య కోసం బడ్జెట్‌లో సుమారు రూ. 1.3 లక్షల కోట్లు (2.5 నుంచి 2.6 శాతం) వెచ్చిస్తోందని, కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి వ్యయం జీడీపీలో 4.1 శాతంగా ఉందన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020) నిర్దేశించిన 6 శాతం లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణతో పాటు విద్యా వ్యవస్థను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో విద్యార్థుల ఆందోళనలు, నిరసనలపై స్పందిస్తూ.. తాను జెన్ జీ తరాన్ని గుడ్డిగా నమ్ముతానని భాగవత్ వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన కూడా చర్చలు, సంప్రదింపుల్లో ఒక ముఖ్యమైన భాగమేనని చెప్పారు. నిరసనలు వ్యవస్థను మెరుగుపరచడానికే తప్ప దేశానికి వ్యతిరేకంగా కాదని అందరూ గ్రహించాలన్నారు. గతంలో తమ తరం పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రశ్నించకుండా అంగీకరించేదని, కానీ నేటి జెన్ జీ, జెన్ ఆల్ఫా తరాలు ప్రశ్నలు వేస్తూ తార్కికమైన సమాధానాలను ఆశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యువతలోని ఈ జిజ్ఞాసను ప్రేమతో, సహనంతో నివృత్తి చేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమస్య పరిష్కారాలకు మార్గం చూపుతోందని గుర్తుచేశారు. సోషల్ మీడియాను నిషేధించడం పరిష్కారం కాదని, దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించడం నేర్చుకోవాలని సూచించారు.
దేశ భద్రత, విదేశాంగ విధానంపైన కూడా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ తనదైన శైలిలో మాట్లాడారు. పాకిస్థాన్, చైనాలతో విభేదాలు ఉన్నప్పటికీ, శాశ్వత శత్రుత్వం దేనికీ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. విభేదాలను పక్కనపెట్టి వ్యవహరించడమే భారత్ అనుసరించే సనాతన విధానమని, మానవత్వమే అత్యున్నతమైనదని అన్నారు. పాకిస్థానీలందరూ మనకు శత్రువులు కారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. అలాగే ఎల్జీబీటీక్యూ వర్గం కూడా మన సమాజంలో భాగమేనని, అందరికీ స్థానం కల్పించే సుదీర్ఘ సంప్రదాయం భారతదేశానికి ఉందన్నారు. అయితే స్వలింగ వివాహాలకు మాత్రం తన మద్దతు ఉండదని స్పష్టం చేశారు. దేశంలో మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు గణనీయంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, పొగాకు వంటి క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.







