చేనేతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి.
• బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు,కర్ణాటక సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి .
* నాంపల్లి చేనేత వస్త్రాలయంలో బీజేపీ నేతల సందర్శన.
* పేదలకు చేనేత చీరలు, దుప్పట్లు పంపిణీ.
హైదరాబాద్, మహా.
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి నాంపల్లిలోని చేనేత వస్త్రాలయాన్ని సందర్శించి పేదలకు చేనేత చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. చేనేత ఉత్పత్తులను ఆదరించడం అంటే కేవలం ఒక వస్త్రాన్ని కొనుగోలు చేయడం కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ నేతన్నల జీవనోపాధికి అండగా నిలవడమేనని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ యువమోర్చా నాయకుడు వంజరి మహేష్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను పరిశీలించి నేతన్నలతో ముచ్చటించారు.
అనంతరం పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ, ప్రతి చేనేత వస్త్రంలో ఒక కళాకారుడి నైపుణ్యం, ఒక కుటుంబ జీవనోపాధి, భారతీయ సాంస్కృతిక వారసత్వం నిక్షిప్తమై ఉంటుందని అన్నారు. చేనేతను ప్రోత్సహించడం ద్వారా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడంతో పాటు మన సంప్రదాయ కళలను భావితరాలకు అందించగలమని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాల ఫలితంగా భారతీయ సంప్రదాయ కళలు, చేనేత ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందని పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు నేతన్నల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని చెప్పారు.
ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో చేనేత వస్త్రాలను వినియోగించాలని, చేనేతను ఆదరించడం ద్వారా మన వారసత్వాన్ని కాపాడటంతో పాటు నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. “చేనేత ధరించండి.. నేతన్నలను ప్రోత్సహించండి.. భారతీయ వారసత్వాన్ని గౌరవించండి” అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








