Mahaa Daily Exclusive

  కంటోన్మెంట్‌లో కలకలం..! నాలుగు ఏకే–47లు.. రెండు ఇన్సాస్‌ తుపాకులు.. తొమ్మిది పిస్టళ్లు.. 1,200 తూటాలు మాయం..!

Share

  •  ఆయుధాల గోదాంపై దుండగుల కన్ను!
  • నాలుగు ఏకే–47లు.. రెండు ఇన్సాస్‌ తుపాకులు..
  • తొమ్మిది పిస్టళ్లు.. 1,200 తూటాలు మాయం..
  • భద్రతా సిబ్బందిపైనే పోలీసుల అనుమానం

హైదరాబాద్‌, మహా.

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది. మద్రాస్‌ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భద్రపరిచిన అత్యంత కీలకమైన ఆయుధాలు, తూటాలు మాయమైన ఘటన భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. బ్యారక్‌ తలుపులు బద్దలుకొట్టి దుండగులు లోపలికి ప్రవేశించి ఆయుధాలను అపహరించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే–47 తుపాకులు, రెండు ఆటోమేటిక్‌ ఇన్సాస్‌ ఆయుధాలు, తొమ్మిది పిస్టళ్లు, సుమారు 1,200 లైవ్‌ బుల్లెట్లు ఉన్నట్లు సమాచారం. సైనిక ప్రాంతంలో ఇంత భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమవడం తీవ్ర భద్రతా ఆందోళనకు దారితీసింది.

ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చోరీ జరిగిన బ్యారక్‌, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఎప్పుడు లోపలికి ప్రవేశించారు? ఎంతసేపు అక్కడ ఉన్నారు? ఆయుధాలను ఎలా బయటకు తరలించారు? ఈ భారీ చోరీ వెనుక ఒక్కరి ప్రమేయమా, లేక పక్కా ప్రణాళికతో పనిచేసిన ముఠా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

తలుపులు బద్దలుకొట్టి.. లోపలికి ప్రవేశం

బ్యారక్‌కు ఉన్న తలుపులను బద్దలుకొట్టి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. ఆయుధాలు భద్రపరిచిన ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీ జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణ దొంగతనంగా కాకుండా.. ఆయుధాల నిల్వ, భద్రతా ఏర్పాట్లపై ముందస్తు అవగాహన ఉన్న వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా సైనిక ప్రాంతాల్లో ఆయుధాల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి ప్రదేశంలోకి చొరబడి పెద్ద సంఖ్యలో తుపాకులు, తూటాలను ఎత్తుకెళ్లడం పోలీసులకు సవాలుగా మారింది. ముఖ్యంగా ఏకే–47లు, ఇన్సాస్‌ తుపాకులు, పిస్టళ్లు మాత్రమే కాకుండా భారీగా లైవ్‌ బుల్లెట్లు మాయమవడంతో ఈ ఘటనను పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

పన్నెండు మంది భద్రతా సిబ్బందిపై విచారణ

చోరీ జరిగిన సమయంలో ఆయుధాల భద్రత కోసం విధుల్లో ఉన్న పన్నెండు మంది సెక్యూరిటీ గార్డులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక ఆపరేషన్‌ బృందం అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన జరిగిన సమయంలో ఎవరు ఏ ప్రాంతంలో విధుల్లో ఉన్నారు? బ్యారక్‌ వద్దకు ఎవరెవరు వచ్చారు? తలుపులు బద్దలయ్యే సమయంలో భద్రతా సిబ్బందికి విషయం ఎందుకు తెలియలేదు? ఆయుధాల నిల్వపై బయటివారికి సమాచారం ఎలా చేరింది? వంటి అంశాలపై ఒక్కొక్కరిని విడిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

భద్రతా సిబ్బంది సంఖ్య పన్నెండు మంది ఉన్నప్పటికీ ఇంత భారీగా ఆయుధాలు, తూటాలు మాయమవ్వడం దర్యాప్తులో కీలక అంశంగా మారింది. విధుల్లో నిర్లక్ష్యం జరిగిందా? లేక ఎవరి సహకారంతోనైనా దుండగులు బ్యారక్‌లోకి ప్రవేశించారా? అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు ప్రస్తుతం ఈ కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఆయుధాల కోసం ప్రత్యేక గాలింపు

చోరీకి గురైన ఆయుధాలు, తూటాలు సాధారణ వస్తువులు కావు. అవి బయటకు వెళ్లిన తర్వాత దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండటంతో వాటి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయుధాలు ఎక్కడికి తరలించబడ్డాయి? వాటిని ఎవరు తీసుకెళ్లారు? చోరీ అనంతరం ఎక్కడైనా వాహనంలో తరలించారా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

దుండగులు ఆయుధాలను విక్రయించేందుకు, ఇతర నేరాలకు ఉపయోగించేందుకు లేదా మరేదైనా ఉద్దేశంతో అపహరించారా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే భారీ సంఖ్యలో తుపాకులు, తూటాలు ఒకేసారి మాయమవడం సాధారణ చోరీ కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.