- బీజేపీ, రిలయన్స్ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
- స్టార్ లింక్ జాప్యంపై మస్క్ తీవ్ర అసహనం
న్యూఢిల్లీ, మహా : టెక్ దిగ్గజం, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “భారత ప్రధాన మంత్రి అంబానీ గారూ..” అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు దుమారం రేపుతున్నాయి. భారత్‌లో తన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అనుమతులు లభించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై అసహనం వ్యక్తం చేశారు. దేశీయ టెలికాం రంగాన్ని శాసిస్తున్న ముకేశ్ అంబానీ ప్రయోజనాల కోసమే తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇది ముమ్మాటికీ గుత్తాధిపత్యమేనని ఆరోపించారు. భారత్‌లో తన స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలకు అడ్డంకులు తొలగకపోవడంతో రిలయన్స్ అధినేతను, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్ డీఏ బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు, భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశంపై రిలయన్స్ జియోతో వివాదం నడుస్తున్న సమయంలో ఎలాన్ మస్క్ పాత పోస్టులు షేర్ చేసి అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు అంబానీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.
పొలిటికల్ లింకులు, ఆరోపణలు
తన ఆరోపణలకు బలం చేకూర్చేందుకు ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘అల్ జజీరా’ గతంలో రాసిన కథనాలను షేర్ చేశారు. ఎలక్టోరల్ బాండ్ల) ద్వారా రిలయన్స్ అనుబంధ సంస్థగా ప్రచారంలో ఉన్న ‘క్విక్ సప్లై’ కంపెనీ, అధికార బీజేపీకి రూ. 385 కోట్లు, శివసేన పార్టీకి రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చిందని ఆ కథనాల్లో కనిపిస్తుంది. బీజేపీకి అందిస్తున్న విరాళాల ద్వారానే రిలయన్స్ అధినేత అంబానీ మద్దతు పొందుతున్నారని మస్క్ ఆరోపించారు. అయితే, క్విక్ సప్లై కంపెనీ ఇండిపెండెంట్ సంస్థ అని, దాంతో తమకు ఎలాంటి సంబంధం లేదని రిలయన్స్ ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలపై రిలయన్స్ నేరుగా స్పందించలేదు. వెనిజులాలో స్టార్ లింక్ సేవలు ప్రారంభమవుతున్నాయని, అందుకు కావాల్సిన అన్ని పర్మిషన్లు వచ్చాయని మస్క్ మరో పోస్ట్ చేశారు.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం
ఎలాన్ మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని, అన్ని సంస్థలకు ఒకే విధమైన రూల్స్ ఉంటాయని తెలిపింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో పాటు జియో శాటిలైట్, భారతీ ఎయిర్‌టెల్ మద్దతున్న వన్ వెబ్ కంపెనీలకు కూడా ప్రాథమిక లైసెన్సులు ఇచ్చామని కేంద్రం పేర్కొంది. అయితే వాణిజ్య సేవలు, స్పెక్ట్రమ్ కేటాయింపులకు ముందు భద్రతాపరమైన తనిఖీలు తప్పనిసరి అని, ఏ సంస్థలకు కేంద్రం వత్తాసు పలకాల్సిన అవసరం లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అన్ని కంపెనీలకు ఒకే విధమైన భద్రతా నియమాలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ తేవాలని మస్క్ ప్రయత్నిస్తున్న క్రమంలో దేశంలోని వ్యాపార నిబంధనలు, స్పెక్ట్రమ్ కేటాయింపు పద్ధతులపై రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఆ విదేశీ కంపెనీ మధ్య విభేదాలు తలెత్తాయి.







