- బీజేపీ శ్రేణులకు ఎన్.రాంచందర్ రావు పిలుపు
- సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఓట్ల తొలగింపు
హైదరాబాద్, మహా : తెలంగాణలో ఇటీవల పూర్తయిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ఆరోపణలను క్షేత్రస్థాయిలో బలంగా తిప్పికొట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆల్ సెల్స్ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బోగస్ ఓట్లను తొలగించి పారదర్శకంగా జాబితాను రూపొందిస్తే, వరుస ఎన్నికల ఓటములతో భయపడిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి రాజ్యాంగ సంస్థలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న “ఓట్ చోరీ” నాటకాలను ఎండగడుతూ, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా వల్ల ప్రజాస్వామ్యానికి చేకూరే ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో ఒక ఫాల్స్ నెరేటివ్‌ను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వీళ్లు సాగిస్తున్న దుష్ప్రచారానికి హద్దు, అదుపు లేకుండా పోయిందన్నారు. అబద్ధాలు ఆడినా కనీసం అతికేటట్లు ఉండాలి కానీ, కాంగ్రెస్ నాయకులు ఆ విచక్షణను కూడా కోల్పోయారన్నారు. శుక్రవారం కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసిన తర్వాత, బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మీడియా ముందు ఇంకో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. తాము చెప్పిన ఆరోపణలకు రాష్ట్రపతి గారు ఆధారాలు అడిగారని స్వయంగా రాహుల్ గాంధీయే చెప్పారన్నారు. తీరా చూస్తే వాళ్ల దగ్గర సమర్పించడానికి ఎలాంటి ప్రూఫ్స్ లేవు. చేతిలో ఒక్క ఆధారం కూడా లేకపోయినా, చివరకు దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న గౌరవ రాష్ట్రపతి గారే ఓటు చోరీని ఒప్పుకున్నారంటూ సిగ్గులేకుండా ప్రచారం మొదలుపెట్టారన్నారు.ఆధారాలు చూపించలేని వీళ్లు, అబద్ధాలను అంటగట్టడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు.







