Mahaa Daily Exclusive

  ‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’

Share

  • కష్టం చెప్పుకోడానికి వచ్చిన రైతును అవహేళన చేసిన గజ్వెల్ ఎమ్మార్వో
  • ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలన్న కేటీఆర్

సిద్ధిపేట, మహా : తన సమస్య చెప్పుకోడానికి వచ్చిన అన్నదాతను ఓ ప్రభుత్వ అధికారి అత్యంత దారుణంగా వ్యవహరించారు. అతడి సమస్యను పరిష్కరించడం మాట అటుంచితే… ‘‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా’ అంటూ అవహేళనగా మాట్లాడారు. ఈ పరిస్థితి సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వో ఆఫీసులో ఓ రైతుకి ఎదురయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వ్యవసాయ భూమి సమస్యతో సతమతమవుతోన్న ఓ రైతు.. పరిష్కారం చూపాలని కోరుతూ గజ్వేల్ ఎమ్మార్వో స్వామిని ఆశ్రయించాడు.

అయితే, సదరు ఎమ్మార్వో రైతును ఉద్దేశించి అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమి సమస్య వల్ల తన బతుకుదెరువు కోల్పోయే పరిస్థితి వచ్చిందని రైతు గోడు వెళ్లబోసుకోగా.. ‘నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా’ అంటూ ఎమ్మార్వో వెటకారంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా.. తన పరిస్థితి చూసి మీకు నవ్వొస్తుందా? అని ఆ రైతు అడిగితే.. ‘‘అవును.. వస్తది, బరాబర్ వస్తది’’ అని ఆయన బదులిచ్చినట్టు వీడియోలో వినిపిస్తోంది.

దేశానికి అన్నం పెట్టే రైతన్న తన కష్టాన్ని చెప్పుకోడానికి వస్తే.. అర్థం చేసుకుని భరోసా ఇవ్వాల్సిన బాధ్యతగల అధికారి ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడటం ఏంటి? అని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలోనూ ఇటువంటి ఘటనల చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకున్నారు.

ఎక్స్ లో స్పందించిన కేటీఆర్

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. మనకు అన్నం పెట్టే రైతన్న పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ఆయన నిలదీశారు. ‘‘ఒక తోటి మనిషితో ఈ అధికారి ప్రవర్తించిన తీరు చూస్తుంటే, వారి మానసిక స్థితిపైనే అనుమానం కలుగుతోంది… ఇది అత్యంత సిగ్గుచేటు.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాని చర్య. ఈ ఎమ్మార్వోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.