Mahaa Daily Exclusive

  ఢిల్లీ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ డెమోక్రటిక్‌’ ఆవిర్భావం…

Share

ఢిల్లీ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ డెమోక్రటిక్‌’ ఆవిర్భావం.
• ప్రజా ఉద్యమాన్ని ఆప్‌ నేతలు తాకట్టు పెట్టారు.
• పార్టీ వ్యవస్థాపకుడు మనీష్‌ బ్రహ్మభట్‌ ఆరోపణ.

న్యూఢిల్లీ, మహా.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ డెమోక్రటిక్‌’ (సీజేపీ–డెమోక్రటిక్‌) పేరుతో కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించింది. పార్టీ వ్యవస్థాపకుడు మనీష్‌ బ్రహ్మభట్‌ గురువారం కొత్త రాజకీయ వేదికను అధికారికంగా ప్రారంభించారు. ప్రజలు రక్తం, చెమటోడ్చి నిర్మించిన ప్రజా ఉద్యమాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యమం విజయవంతమైన అనంతరం దాని అసలు స్ఫూర్తిని పక్కనపెట్టి, దానిని ‘టీమ్‌ కేజ్రీవాల్‌’గా మార్చేశారని విమర్శించారు.

ఉద్యమంలో క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొన్న వాలంటీర్లు, నిరసనకారులను సంప్రదించకుండానే కొందరు నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని బ్రహ్మభట్‌ ఆరోపించారు. ఇళ్లలో కూర్చొని 12 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారిని పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆ కమిటీలో స్థానం కల్పించారని విమర్శించారు.

సోషల్‌ మాధ్యమాల ద్వారా ఉద్యమానికి మద్దతుగా పోరాడిన వారిని కూడా విస్మరించారని బ్రహ్మభట్‌ పేర్కొన్నారు. ఆప్‌తో సంబంధం ఉన్న ఎనిమిది మందితో పాటు వ్యక్తిగత పరిచయాలు ఉన్నవారిని కమిటీలో చేర్చారని ఆయన ఆరోపించారు. ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు ఉద్యమకారులు, వాలంటీర్లతో కూడిన నిజమైన జాతీయస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించామని తెలిపారు. పార్టీలో పైస్థాయి ఆదేశాలకే ప్రాధాన్యం ఇచ్చే విధానానికి బదులుగా పారదర్శకంగా ప్రతినిధులను ఎంపిక చేయాలని కోరినా తమ ప్రతిపాదనను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

కేజ్రీవాల్‌పై బ్రహ్మభట్‌ తీవ్ర ఆరోపణలు

ఈ పరిణామాల వెనుక నుంచి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయాలను నడిపించారని బ్రహ్మభట్‌ ఆరోపించారు. ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ఆయనకు కొత్త కాదని విమర్శించారు. గతంలో అన్నా హజారే ఆధ్వర్యంలో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ఉద్యమాలను కూడా అదే విధంగా రాజకీయంగా మలచే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజాస్వామ్య విలువలను ఆధారంగా చేసుకుని ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలనే ఉద్దేశంతోనే ‘కాక్రోచ్ జనతా పార్టీ డెమోక్రటిక్‌’ను ఏర్పాటు చేసినట్లు బ్రహ్మభట్‌ వెల్లడించారు. పార్టీలో పారదర్శకత, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యం, ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తామని తెలిపారు.