- ఓటర్ల గల్లంతుపై గందరగోళం.
- యోగీని నిలదీసిన అఖిలేశ్!
- 1.27 కోట్ల మంది హిందూ ఓటర్లు కనిపించడం లేదన్న సీఎం.
- 2.5 కోట్ల మంది అర్హులకు ఓటరు జాబితాలో చోటులేదన్న ఎన్నికల అధికారి.
- మరి నిజం చెబుతున్నదెవరు? 2.84 లక్షల బోగస్ ఓటర్లున్నాయంటూ ఆరోపణ.
లక్నో, మహా:
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితా వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు జాబితాలో లేవన్న అంశంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు కనిపించడం లేదని చెబుతుండగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా సుమారు 2.5 కోట్ల మంది అర్హులైన వ్యక్తులు ఓటరు జాబితాలో లేరని వెల్లడించారు. ఈ రెండు గణాంకాలను ప్రస్తావిస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సీఎం యోగిని నిలదీశారు. ఎన్నికల సంఘం మతం, కులం ఆధారంగా ఓటర్ల వివరాలనే సేకరించనప్పుడు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల సంఖ్యను ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు.
రెండు గణాంకాలు.. అసలు లెక్క ఏది?
లక్నోలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిలేశ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒకవైపు 1.27 కోట్ల మంది హిందూ ఓటర్ల పేర్లు కనిపించడం లేదని చెబుతుండగా, మరోవైపు ప్రధాన ఎన్నికల అధికారి సుమారు 2.5 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేవని చెబుతున్నారని అన్నారు. నవంబరు 17న ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం ఓటర్ల మతం, కులం ఆధారంగా గణాంకాలను తాము నిర్వహించబోమని స్పష్టం చేసిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన హిందూ ఓటర్ల సంఖ్యకు ఆధారం ఏమిటని ప్రశ్నించారు.
ఎన్నికల అధికారి ఏం చెప్పారు?
ఈ వివాదంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా ఇచ్చిన వివరణ కీలకంగా మారింది. ఎన్నికల సంఘం వద్ద ఓటర్ల మతం, కులం వివరాలు ఉండవని, అందువల్ల మతాల వారీగా ఓటర్ల సంఖ్యను నిర్ధారించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. 2026 జనాభా అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 18 ఏళ్లు నిండినవారు సుమారు 16.16 కోట్లు ఉండగా, నవంబరు 17న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 13.58 కోట్ల మంది ఉన్నారని వివరించారు. ఈ రెండు గణాంకాల మధ్య సుమారు 2.58 కోట్ల వ్యత్యాసం ఉందని తెలిపారు. అయితే ఈ సంఖ్య గతంలో జాబితాలో ఉండి తొలగించబడిన ఓటర్లను మాత్రమే సూచించదని, అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఓటరుగా నమోదు కానివారిని కూడా కలుపుకొని చేసిన అంచనా అని స్పష్టం చేశారు.
నకిలీ ఓటర్ల చేరికకు కుట్ర జరుగుతోందా?
ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీగా నకిలీ, డూప్లికేట్ పేర్లు చేరుతున్నాయని అఖిలేశ్ ఆరోపించారు. నవంబరు 17న విడుదలైన జాబితాను తమ పార్టీ విశ్లేషించగా 2.84 లక్షల అనుమానాస్పద, నకిలీ ఓటర్ల నమోదు గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో తొలగించినట్లు చెప్పిన 55,584 మంది నకిలీ ఓటర్ల పేర్లను తిరిగి చేర్చారని ఆరోపించారు. మరో 52 వేల నమోదుల్లో ఓటర్ల అసలు పేర్లకు బదులుగా ‘శ్రీ’, ‘శ్రీమతి’ వంటి సంబోధనలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
ఫారం-6 దరఖాస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయి?
కొత్తగా ఓటరుగా నమోదు కావడానికి ఉపయోగించే ఫారం-6 దరఖాస్తులు 22 రెట్లు పెరిగాయని అఖిలేశ్ ప్రస్తావించారు. ఇంత భారీగా దరఖాస్తులు పెరగడానికి కారణమేంటని ప్రశ్నించారు. సిబ్బంది సంఖ్య పెరిగిందా? వ్యవస్థ సామర్థ్యం పెరిగిందా? లేక యంత్రాలు అకస్మాత్తుగా వేగంగా పనిచేయడం ప్రారంభించాయా? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు అవకాశం కల్పించేందుకే ముందస్తుగా పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతయ్యారనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కై నకిలీ ఓటర్లను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఆధార్ అనుసంధానం.. బయోమెట్రిక్ ధ్రువీకరణకు డిమాండ్
ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టేందుకు ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. నకిలీ ఓటింగ్‌ను నిరోధించేందుకు బయోమెట్రిక్ ధ్రువీకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలని, మెటల్‌తో తయారుచేసిన ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయాలని సూచించారు. తమ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసినప్పటికీ డూప్లికేట్ ఓటర్లపై తీసుకున్న చర్యల వివరాలు వెల్లడించలేదని ఆరోపించారు. ఫిర్యాదులపై స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిపాలనా, పోలీసు అధికారుల్లో కనీసం 50 శాతం మంది వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీ వర్గాలకు చెందినవారై ఉండాలని కోరారు.
జనవరి 4న తుది ఓటర్ల జాబితా
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైంది. డిసెంబరు 16 వరకు పేర్ల నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించి అభ్యంతరాలు, దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2027 జనవరి 4న తుది ఓటర్ల జాబితా ప్రకటించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటర్ల జాబితాలో పరిశీలించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ల గణాంకాలపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్న తరుణంలో తుది జాబితా విడుదలయ్యే నాటికి ఎన్ని పేర్లు చేరతాయి, ఎన్ని తొలగింపులకు గురవుతాయి, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల్లో ఎన్ని నిజమని తేలుతాయన్నది ఆసక్తికరంగా మారింది.







