- ఆకట్టుకుంటున్న నీహారిక హైపర్ ఎనలిటికల్
- యువతలో ఆధ్యాత్మిక పరిమళాలు
హైదరాబాద్ సిటీ, మహా :
ఇపుడు సోషల్ మీడియాలో విపరీతమైన కంటెంట్ పుట్టుకొస్తోంది. అయినా మన పురాణాలకు, కొత్త కంటెంట్ కు ఎపుడూ ఆదరణ ఉంటుంది. ఒత్తిడిలో ఉన్న వారికి ఒత్తిడి తొలగించేలా, భవిష్యత్తుపై భరోసా కలిగించేలా ఓ యువతి హైపర్ ఎనలిటికల్ పేరుతో ఇన్ స్టాలో చేస్తున్న ప్రయత్నం ఎంతోమందిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ రాత్రి 10.15కు గంటకొట్టినట్లుగా సిరీస్ అప్ లోడ్ చేస్తూ చాలీసా గురించి.. ఎంతోమందికి తెలిసిన విషయాలే అయినా పురాణాలను తాను అర్ధం చేసుకున్న పద్దతిలో వివరిస్తూ ఈ తరానికి కనెక్ట్ అవుతోంది. ఆధ్యాత్మికతను కనెక్ట్ చేస్తోంది. హనుమాన్ చాలీసాలోని శ్లోకాల అంతరార్థాన్ని వివరిస్తూ, వాటిని నిత్యజీవితానికి అన్వయిస్తూ యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, పాజిటివ్ ఆలోచనలు పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ‘హైనల్ ఎనలిటికల్’ పేరుతో కొనసాగుతున్న ఈ ప్రొఫైల్‌లో హనుమాన్ చాలీసా ప్రత్యేక సిరీస్ ద్వారా ప్రతిరోజూ ఒక కొత్త అంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. కేవలం శ్లోకాలను పఠించడమే కాకుండా.. వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సందేశాలను సరళమైన భాషలో వివరిస్తోంది.
ఆధ్యాత్మికం.. ఆకర్షణీయం
హనుమాన్ చాలీసా పఠనం వల్ల కలిగే మానసిక ధైర్యం, శ్రీరామ నామస్మరణ ప్రాధాన్యత, ప్రతికూల ఆలోచనలను అధిగమించడం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికతలోని అంతరార్థం వంటి అంశాలను తన వీడియోల ద్వారా వివరిస్తూ ఆకట్టుకుంటోంది. ఇన్ స్టాలో హైపర్ ఎనలిటికల్, యూట్యూబ్ లో నీహారికసరిపల్లి పేరుతో ఉన్న ఎకౌంట్స్ లో ఈ యువతి తన చాలీసా వీడియోలు చేస్తూ స్ఫూర్తినింపుతూ సరికొత్త కోణంలో జై హనుమాన్ అనిపిస్తోంది. ప్రతిరోజూ రాత్రి 10:15 గంటలకు హనుమాన్ చాలీసా సిరీస్‌లో కొత్త ఎపిసోడ్‌ను అందిస్తూ, ఇప్పటికే 30వ ఎపిసోడ్ వరకు ఈ ప్రయాణాన్ని కొనసాగించింది. ప్రత్యేకంగా యువతలో పెరుగుతున్న ఒత్తిడి, ప్రతికూల ఆలోచనల మధ్య.. ఆధ్యాత్మికత ద్వారా మనోధైర్యాన్ని పెంపొందించుకోవచ్చనే సందేశాన్ని అందించడమే ఈ ప్రయత్నంలో కనిపిస్తున్న ప్రధాన ఉద్దేశం. భక్తిని కేవలం ఆచారంగా కాకుండా.. జీవితానికి ఆత్మవిశ్వాసాన్ని అందించే మార్గంగా పరిచయం చేస్తూ, డిజిటల్ వేదికపై తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్న ఈ యువతివీడియోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.








