- భారత్‌కు గ్లోబల్ బ్రాండ్ల క్యూ!
- రూ.2,270 కోట్ల విలువైన ఆర్డర్లు మళ్లింపు.
- వస్త్ర పరిశ్రమకు కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ, మహా:
బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కార్మిక ఆందోళనలు, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు భారత్‌కు కలిసివస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ రిటైల్ సంస్థలు తమ వస్త్ర తయారీ ఆర్డర్లను బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాలకు మళ్లిస్తుండగా, వాటిలో అత్యధికంగా భారత్ లబ్ధి పొందుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. జారా, హెచ్ అండ్ ఎం, మార్క్స్ అండ్ స్పెన్సర్, సెలియో వంటి అంతర్జాతీయ బ్రాండ్లు భారత్‌లోని తయారీ సంస్థలకు ఆర్డర్లు ఇస్తున్నట్లు వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు.
రూ.2,270 కోట్ల ఆర్డర్లు ఇతర దేశాలకు
నవంబరు 1 నుంచి 18వ తేదీ మధ్య సుమారు 254 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాలకు మళ్లినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. భారత కరెన్సీలో వీటి విలువ దాదాపు రూ.2,270 కోట్లు. ఈ ఆర్డర్లలో అధిక భాగం భారత్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కు సాధారణంగా వచ్చే నెలవారీ ఆర్డర్లలో దాదాపు పదో వంతు ఈ కాలంలో ఇతర దేశాలకు తరలిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కార్మిక ఆందోళనలతో భారీ నష్టం
బంగ్లాదేశ్‌లో వస్త్ర కార్మికుల ఆందోళనలు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా 400 మిలియన్ డాలర్లకు పైగా ఉత్పత్తి నష్టం వాటిల్లినట్లు ఆ దేశ వస్త్ర తయారీదారులు, ఎగుమతిదారుల సంఘం (బీజీఎంఈఏ) వెల్లడించినట్లు తెలిసింది . బంగ్లాదేశ్ ఎగుమతి ఆదాయంలో 80 శాతానికి పైగా, తయారీ రంగ ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం వస్త్ర పరిశ్రమపైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఈ రంగంలో ఏర్పడుతున్న సంక్షోభం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది.
వేతనాల పెంపుతో పెరిగిన ఉత్పత్తి వ్యయం
వస్త్ర కార్మికుల కనీస వేతనాలను 36 శాతం పెంచుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా తయారీదారులపై అదనపు భారాన్ని మోపుతోంది. అయితే కార్మికులు అంతకంటే ఎక్కువ వేతనాలు కోరుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వేతనాల పెంపుతో పాటు విద్యుత్ కొరత, ముడిసరుకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరగడం అక్కడి పరిశ్రమలకు సవాలుగా మారింది. గతంలో తక్కువ కార్మిక వ్యయం బంగ్లాదేశ్‌కు ప్రధాన బలంగా ఉండగా, ఇప్పుడు ఆ ప్రయోజనం తగ్గుతోందని పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
భారత్‌లో వారం ముందే సరుకు డెలివరీ
అంతర్జాతీయ కొనుగోలుదారులు కేవలం ఉత్పత్తి వ్యయాన్నే కాకుండా సరుకుల సరఫరా వేగాన్నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్‌తో పోలిస్తే భారత్‌లో తయారైన వస్త్రాలను దాదాపు వారం రోజుల ముందుగానే సరఫరా చేసే అవకాశం ఉందని పరిశ్రమ ప్రతినిధి ఎం. మొహియుద్దీన్ చౌదరి తెలిపారు. ప్రత్యామ్నాయ దేశాల్లో ఉత్పత్తి, డెలివరీ ప్రక్రియ 60 నుంచి 90 రోజుల్లో పూర్తవుతుండగా, బంగ్లాదేశ్‌లో సుమారు 120 రోజులు పడుతోందని వివరించారు. వియత్నాం, కంబోడియా కూడా 15 రోజుల వరకు డెలివరీ సమయాన్ని తగ్గించగల ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి.
వస్త్ర కంపెనీల షేర్లకు ఊతం
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు ఆర్డర్లు మళ్లుతున్నాయన్న వార్తలు దేశీయ వస్త్ర కంపెనీల షేర్లపై సానుకూల ప్రభావం చూపాయి. గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్ షేరు ఒక దశలో 11 శాతం వరకు పెరగగా, ట్రైడెంట్ సుమారు 5 శాతం లాభపడింది. వెల్స్‌పన్ లివింగ్, కేపీఆర్ మిల్, వర్ధమాన్ టెక్స్‌టైల్స్ షేర్లు కూడా దాదాపు 2 శాతం చొప్పున పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాత్కాలిక అవకాశమా.. దీర్ఘకాలిక లాభమా?
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడిన తర్వాత కూడా ప్రస్తుతం ఇతర దేశాలకు మళ్లిన ఆర్డర్లు తిరిగి అక్కడికి వెళ్తాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఢాకా పరిసర ప్రాంతాల్లోని తయారీ సంస్థలు 20 నుంచి 25 ఉత్పత్తి పనిదినాలను కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్త ఆర్డర్లు నిలిచిపోవడం, కొన్ని ఆర్డర్లు వాయిదా పడటం, మరికొన్ని రద్దు కావడం లేదా ఇతర దేశాలకు తరలిపోవడం అక్కడి తయారీదారుల ఆందోళనను పెంచుతోంది.
ఈ పరిణామం భారత్ వస్త్ర పరిశ్రమకు కొత్త అవకాశాలను తెచ్చిపెడుతున్నప్పటికీ, వాటిని దీర్ఘకాలిక ప్రయోజనాలుగా మార్చుకోవడం కీలకం. అంతర్జాతీయ బ్రాండ్లకు నాణ్యత, ధర, ఉత్పత్తి సామర్థ్యం, సకాలంలో సరఫరా వంటి అంశాల్లో నమ్మకం కల్పించగలిగితే భారత్ ప్రపంచ వస్త్ర తయారీ కేంద్రంగా మరింత బలపడే అవకాశం ఉంది.







