Mahaa Daily Exclusive

  చార్‌ధామ్‌ యాత్రికులకు రైలు ప్రయాణ సౌకర్యం..! సాంకేతిక నైపుణ్యంతో మరో కీలక మైలురాయి..

Share

  • చార్‌ధామ్‌ యాత్రికులకు రైలు ప్రయాణ సౌకర్యం
  • రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ మార్గంలో 6.59 కి.మీ. సొరంగం ఛేదన పూర్తి
  • సాంకేతిక నైపుణ్యంతో మరో కీలక మైలురాయి

హైదరాబాద్, మహా : ఉత్తరాఖండ్‌లోని పవిత్ర చార్‌ధామ్‌ క్షేత్రాలైన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి యాత్రలకు వెళ్లే భక్తుల ప్రయాణాన్ని భవిష్యత్తులో మరింత సులభతరం చేసే రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్వే ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి నమోదైంది. ఈ ప్రాజెక్టులో భాగంగా రుద్రప్రయాగ్‌ జిల్లాలో 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌–14 ప్రధాన సొరంగం తవ్వకాలను మెఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఏం ఈ ఐ ఎల్) విజయవంతంగా పూర్తి చేసింది. హిమాలయ పర్వతాల్లో అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ప్రతికూల వాతావరణాన్ని అధిగమిస్తూ సంస్థ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు చూపిన అసాధారణ నైపుణ్యం, సమష్టి కృషికి ఈ బ్రేక్‌త్రూ నిదర్శనంగా నిలిచింది. ఇదే ఏడాది జూన్ లో కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య శ్రీనగర్ జమ్మూ మధ్య నిరంతర రాకపోకలకు ఉపయోగపడే జోజిల టన్నెల్ ను మేఘా బ్రేక్ త్రూ చేసిన విషయం తెలిసిందే.

చార్‌ధామ్‌ యాత్రకు మెరుగైన రవాణా అనుసంధానం

రిషికేశ్‌ నుంచి కర్ణప్రయాగ్‌ వరకు నిర్మిస్తున్న ఈ రైల్వే మార్గం ఉత్తరాఖండ్‌ పర్వత ప్రాంతాల రవాణా ముఖచిత్రాన్ని మార్చనుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు రైలు మార్గం ద్వారా పర్వత ప్రాంతాలకు చేరుకోవడం సులభతరం కానుంది. అక్కడి నుంచి రహదారి మార్గంలో యాత్రా క్షేత్రాలకు వెళ్లేందుకు మెరుగైన అనుసంధానం లభించనుంది. ముఖ్యంగా యాత్రా సీజన్‌లో రహదారులపై పెరిగే రద్దీ, ప్రయాణ సమయం, రవాణా ఇబ్బందులను తగ్గించేందుకు ఈ రైల్వే ప్రాజెక్టు దోహదపడనుంది. పర్యాటకుల రాక పెరగడంతో స్థానిక వ్యాపారాలు, పర్యాటక రంగం, ఉపాధి అవకాశాలకూ ఊతం లభించనుంది.

రెండు వైపుల నుంచి తవ్వకాలు

మొత్తం 6.59 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌–14లో సుమేర్‌పూర్‌ పోర్టల్‌ నుంచి 4.7 కిలోమీటర్లు, మారోరా పోర్టల్‌ నుంచి 1.79 కిలోమీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. రెండు వైపుల నుంచి సాగిన తవ్వకాలను విజయవంతంగా అనుసంధానించడంతో ప్రధాన సొరంగం బ్రేక్‌త్రూ పూర్తయింది.

సుమేర్‌పూర్‌ వైపు నివాస ప్రాంతాల కింద సుమారు 110 మీటర్ల మేర ట్రిపుల్‌ ట్రాక్‌ సొరంగాన్ని వదులైన మట్టిలో తవ్వడం అత్యంత సవాలుగా మారింది. సొరంగం పైన 20–30 మీటర్ల మేర మట్టి, రాతి పొరలు ఉండటంతో ప్రీ-ఎక్స్‌కవేషన్‌, మల్టీ-డ్రిఫ్టింగ్‌ వంటి ప్రత్యేక సాంకేతిక పద్ధతులను అమలు చేశారు. భూమి స్థిరత్వాన్ని కాపాడుతూ సురక్షితంగా తవ్వకాలు కొనసాగించారు.

మారోరా వైపు కొండ వాలుల స్థిరత్వాన్ని కాపాడేందుకు 30–35 మీటర్ల లోతు మైక్రోపైల్స్‌, 15–20 మీటర్ల పొడవైన రాక్‌ బోల్ట్స్‌, కన్సాలిడేషన్‌ గ్రౌటింగ్‌ పద్ధతులను వినియోగించారు. మారోరా ప్రాంతంలో భూమి కుంగుబాటు సమస్యలు, భూసేకరణ, నివాస గృహాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం అనంతరం 2024 మార్చిలో ప్రధాన సొరంగం తవ్వకాలు ప్రారంభమయ్యాయి.

మారోరా వైపు సుమారు 100 మీటర్ల మేర యాంత్రిక పద్ధతిలో తవ్వకాలు చేపట్టారు. సమీప నివాస ప్రాంతాల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండు పోర్టళ్ల వద్ద పగటిపూట మాత్రమే నియంత్రిత బ్లాస్టింగ్‌ నిర్వహించారు. సుమేర్‌పూర్‌ వైపు 4.7 కిలోమీటర్ల మేర తవ్వకాలు సాగిన నేపథ్యంలో సొరంగంలో స్వచ్ఛమైన గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ప్రత్యేక వెంటిలేషన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దారి

రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాఖండ్‌లోని మారుమూల పర్వత ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. స్థానిక ప్రజలకు ప్రయాణ సౌలభ్యం పెరగడంతో పాటు, చార్‌ధామ్‌ యాత్రికులు, పర్యాటకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. వాణిజ్యం, పర్యాటకం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి రంగాల అభివృద్ధికీ ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.

టన్నెల్‌–14 బ్రేక్‌త్రూతో ఈ ప్రతిష్ఠాత్మక రైల్వే ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. హిమాలయాల వంటి సవాలుతో కూడిన ప్రాంతంలో సాంకేతిక పరిజ్ఞానం, సంస్థాగత నిబద్ధత, కార్మికుల అంకితభావం కలిస్తే ఎంతటి క్లిష్టమైన నిర్మాణాన్నైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చని ఏం ఈ ఐ ఎల్ సాధించిన ఈ విజయం చాటిచెబుతోంది.

Latest