Mahaa Daily Exclusive

  డీలిమిటేషన్‌పై స్టాలిన్‌ సమరశంఖం..! తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదు..

Share

• తమిళనాడు ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదు.
• 1971 జనాభా నిష్పత్తి మరో 25 ఏళ్లు కొనసాగాలి

చెన్నై, మహా:

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) అంశంపై కేంద్ర ప్రభుత్వానికి డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని తేల్చిచెప్పారు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంచినా తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్య వాటా తగ్గకూడదని, 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ రెండు అంశాలపై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని శుక్రవారం సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు.

డీలిమిటేషన్‌పై న్యాయమైన విధానం కోసం దేశంలో తొలుత గళమెత్తిన రాజకీయ పార్టీల్లో డీఎంకే ముందుందని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు తొలిసారిగా చెన్నై వేదికగా సమావేశమై తమ అభిప్రాయాలను పంచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన తీర్మానం, న్యాయమైన నియోజకవర్గాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే తమ డిమాండ్లను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

లోక్‌సభలో నియోజకవర్గాల సంఖ్య పెంచే క్రమంలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం వాటా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదన్నది డీఎంకే మొదటి డిమాండ్‌. రెండోది.. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య నిర్ణయించి, ప్రస్తుతం కొనసాగిస్తున్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు మార్చకూడదని కోరడం. ఈ రెండు డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్టాలిన్‌ స్పష్టం చేశారు. తమ వైఖరిపై వస్తున్న ఊహాగానాలు, రాజకీయ విమర్శలు పార్టీ నిర్ణయాన్ని మార్చలేవని పేర్కొన్నారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడటంలో డీఎంకే ఎప్పటికీ రాజీపడదని ప్రకటించారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన

డీలిమిటేషన్‌ అంశం తమిళనాడుకే పరిమితం కాకుండా దక్షిణాది రాష్ట్రాల రాజకీయాల్లోనూ కీలక చర్చకు దారితీస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పునర్విభజిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్యంలో సమతుల్యతను ఎలా కాపాడాలన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.

Latest