Mahaa Daily Exclusive

  తెలంగాణలో రెవెన్యూ అధికారుల భారీ బదిలీలు.

Share

  •  జీవో 630 జారీ చేసిన సర్కార్.

హైదరాబాద్, మహా.

తెలంగాణలో రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేస్తూ జీవో నంబర్ 630ను రెవెన్యూ శాఖ విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం, సేవల విస్తరణ దృష్ట్యా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కల్పిస్తూ కొత్త పోస్టింగ్‌లను కేటాయించారు.

ఈ బదిలీల్లో భాగంగా బి. రాజాగౌడ్‌ను జగిత్యాల అదనపు కలెక్టర్ (ఎల్‌బీ) స్థానం నుంచి నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేశారు. అలాగే ఎన్. ప్రసూనాంబను జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించగా, డి. వెంకట మాధవరావుకు నిర్మల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బాధ్యతలను అప్పగించారు. వనపర్తి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)గా పి. రామ్‌రెడ్డిని బదిలీ చేయగా, మహబూబ్‌నగర్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ)గా ఎ. యాదగిరికి పోస్టింగ్ లభించింది.

ఇదే క్రమంలో మోహన్ సింగ్‌ను రాజన్న-సిరిసిల్ల జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (ఎల్‌ఏ)గా నియమించగా, పి. పద్మప్రియను హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ కు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అధికారిగా సీహెచ్. కృష్ణయ్యను నియమించగా, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ (ఎల్‌ఏ)గా జి. కుమారస్వామిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా స్థానచలనం పొందిన అధికారులందరూ తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని సర్కార్ స్పష్టం చేసింది.

Latest