- ఆరు వరుసల విస్తరణకు కీలక ముందడుగు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసే దిశగా ప్రతిష్టాత్మక హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు వేగవంతమైంది. జాతీయ రహదారి 65ను ఆరు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.12,074 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు సుమారు 286 కిలోమీటర్ల మేర చేపట్టనున్న ఈ విస్తరణ పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.
మూడు ప్యాకేజీలుగా నిర్మాణ పనులు.
ఈ విస్తరణ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు వేర్వేరు ప్యాకేజీలుగా విభజించారు. హైదరాబాద్‌లోని ఔటర్ రింగు రోడ్డు సమీప ప్రాంతం నుంచి విజయవాడలోని గొల్లపూడి వరకు మొదటి ప్యాకేజీ కింద చేపట్టనున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి నందిగామ వరకు రెండో ప్యాకేజీగా, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మూడో ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. ఈ విభజన ద్వారా పనుల్లో వేగం పెరగడంతో పాటు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు.
తొలి ప్యాకేజీ టెండర్ల ఆహ్వానం.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి ప్యాకేజీకి సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ విధానంలో చేపట్టే ఈ పనులకు సంబంధించిన టెండరు ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. నవంబరు నెలాఖరు నాటికి బిడ్ల ప్రక్రియ పూర్తి చేసి, పనులను ప్రారంభించాలని యంత్రాగిం కసరత్తు చేస్తోంది. ఈ రహదారి ఆరు వరుసలుగా విస్తరణ పూర్తిైతే రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సరకు రవాణా మరింత సులభం కానుంది.
రీజినల్ రింగు రోడ్డు పనులపై ప్రత్యేక దృష్టి.
మరోవైపు హైదరాబాద్ ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి భూసేకరణ తుది దశకు చేరిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే టెండర్ల ప్రక్రియ కొలిక్కి రానుంది. అలాగే దక్షిణ భాగానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ వేగంగా కొనసాగుతోంది. మంజూరైన అన్ని ప్రధాన రహదారి ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.








