- అర్హులంతా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపు
హైదరాబాద్, మహా.
తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రముఖ రాజకీయ నాయకురాలు కల్వకుంట్ల కవిత తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా తన పేరును నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల జాబితా తయారీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని కవిత పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిలదీసే గొంతుకలను చట్టసభలకు పంపాల్సిన బాధ్యత విద్యావంతులైన పట్టభద్రులపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో తాము మంచి అభ్యర్థులను బరిలో నిలపనున్నామని, ప్రజా సమస్యలపై గట్టిగా గళం వినిపించే నాయకులను గెలిపించాలని కోరారు. గతంలో ఓటర్లుగా నమోదైనప్పటికీ, నిబంధనల ప్రకారం ప్రతిసారీ కొత్తగా ఓటర్ల జాబితా తయారవుతుంది కాబట్టి పాత ఓటర్లు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఫారమ్-18 ద్వారా నవంబరు 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. 2026 నవంబరు 1 నాటికి కనీసం మూడేళ్ల ముందే, అంటే 2023 అక్టోబరు 31 నాటికి లేదా అంతకంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అర్హులైన వారందరూ తగిన ధృవీకరణ పత్రాలతో గడువులోగా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలల తరబడి సాగే ఓటరు నమోదు ప్రక్రియ అనంతరం నవంబరు 25న ముసాయిదా జాబితా విడుదల కానుండగా, డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.








