Mahaa Daily Exclusive

  ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే పూర్తి.

Share

  •  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
  •  భూ వివాదరహిత తెలంగాణే లక్ష్యంగా ఏడు జోన్లలో 14 మంది అధికారుల పర్యవేక్షణ.
  •  సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలో 45 ఎకరాల వ్యత్యాసాలపై మరోసారి నోటీసులు

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూసర్వే నిర్వహిస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సర్వే పురోగతి, భూవివాదాల పరిష్కారంపై ఆయన సమీక్షించారు. రాబోయే ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వేను పూర్తిగా ముగించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పర్యవేక్షణ బాధ్యతలను మరింత పకడ్బందీగా నిర్వర్తించేందుకు ఏడు జోన్ల పరిధిలో ప్రత్యేకంగా 14 మంది సీనియర్ అధికారులను నియమించినట్లు ఆయన స్పష్టం చేశారు.

సర్వే ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో భూముల సరిహద్దులు, విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రికార్డుల్లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని గుర్తించి తగిన పత్రాల ఆధారంగా సరిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ సర్వే పేరుతో ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలి దశలో ఎంపిక చేసిన 2,768 రెవెన్యూ గ్రామాల్లో సర్వేను ముమ్మరం చేసి, నవంబరు చివరి నాటికి మొదటి దశను విజయవంతంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఎర్రవల్లి భూముల రికార్డులపై ప్రత్యేక దృష్టి..

సిద్ధిపేట జిల్లా మార్కుక్‌ మండలం ఎర్రవల్లి పరిధిలో ఉన్న భూముల రికార్డులపై మరోసారి విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలోని సర్వే నంబరు 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండగా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ 45 ఎకరాల వ్యత్యాసానికి గల అసలు కారణాలను తేల్చేందుకు అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు.

గతంలో పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూములు నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల చేతుల్లోకి వెళ్లిన అంశంపై కూడా ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది. అసలు పట్టాదారులు ఎవరనేది పరిశీలించి వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, ఒకవేళ అక్రమంగా భూములు బదిలీ అయినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెందాల్సిన అసైన్డ్‌ భూములు ఎక్కడైనా అన్యాక్రాంతమైనట్లు తేలితే, వాటిని వెనక్కి తీసుకొని అర్హులైన పేదలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. ఈ సమగ్ర భూసర్వే ద్వారా రాష్ట్రంలో భూ వివాదాలను పూర్తిగా రూపుమాపి, పారదర్శకమైన రెవెన్యూ పాలనను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు.