Mahaa Daily Exclusive

  సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తప్పుకోవాలి.

Share

  •  బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్.
  •  తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్.

హైదరాబాద్, మహా.

ప్రధాన ఎన్నికల కమిషనర్ తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పేరుతో అర్హులైన వేల సంఖ్యలోని ఓట్లను ఏకపక్షంగా తొలగించారని ధ్వజమెత్తారు.

ఒక ప్రైవేట్ సంస్థ సహకారంతో ఓట్లను విచ్చలవిడిగా తొలగించారని, సీఈసీ పనితీరు ఎంత పేలవంగా ఉందో దీనిబట్టೇ అర్థమవుతోందని రవిచంద్ర విమర్శించారు. తొలగించిన ఓట్లకు సంబంధించి తగిన అర్హతలు చూపినప్పటికీ, వాటిని తిరిగి జాబితాలో చేర్చకపోవడం దారుణమన్నారు. రోగికి డాక్టరే విషం ఇచ్చి చంపినట్లుగా.. ఎన్నికల సంఘం దేశ పౌరులను ఓటు హక్కుకు దూరం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లపై సమగ్ర విచారణ జరపాలని, ‘ఫారం 7’ పేరిట వస్తున్న దరఖాస్తులపై లోతైన దర్యాప్తు చేపట్టాలని కోరారు. అలాగే ఈవీఎంల పనితీరుపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ మీడియా సమావేశంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.