- గులాబీ పార్టీ పిలుపు.
- కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో వేడుకలు.
- ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్న కేటీఆర్.
- ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమకారులు, జేఏసీల సన్మానానికి బీఆర్ఎస్ సన్నాహాలు.
హైదరాబాద్, మహా .
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి దశాబ్దం పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 10, 11 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ ఒక ప్రధాన ఆశయమని, ప్రజల ముంగిటికే పరిపాలనను తీసుకురావాలన్న లక్ష్యంతోనే కేసీఆర్ ప్రభుత్వం నాడే 10 జిల్లాల స్థానంలో 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు.
జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదని, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులు, వైద్య, విద్యా సదుపాయాలను ప్రజలకు చేరువ చేసే బృహత్తర ప్రక్రియ అని కేటీఆర్ పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణతో గత పదేళ్లలో వచ్చిన మార్పులను, సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత గులాబీ శ్రేణులపై ఉందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ వేడుకలను నిర్వహించి, ఆయా జిల్లాల సాధన కోసం ఉద్యమించిన జేఏసీలు, ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని ఆదేశించారు.
సిద్ధిపేట వేదికగా ముమ్మర ఏర్పాట్లు..
ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కేసీఆర్ చొరవతోనే సిద్ధిపేట జిల్లాగా ఏర్పడిందని, 2016 అక్టోబర్ 11న దసరా పండుగ సందర్భంగా నూతన జిల్లా ప్రారంభమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. పదేళ్లు పూర్తవుతున్న శుభసందర్భంగా సిద్ధిపేటలో ‘జిల్లా పదేళ్ల పండుగ’ పేరుతో అక్టోబర్ 9, 10, 11 తేదీల్లో మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో భారీ వేడుకలకు రూపకల్పన చేశారు.
సిద్ధిపేట తరహాలోనే రాష్ట్రంలోని అన్ని పాత, కొత్త జిల్లా కేంద్రాల్లోనూ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు. ఈ వేడుకల్లో లాయర్లు, జర్నలిస్టులు, ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.








