- ఈనెల 12న అల్లిపురంలో భూమిపూజ.
- రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
ఖమ్మం, మహా.
ఖమ్మం నగరంలోని అల్లిపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులతో కలిసి మంత్రి భూమిపూజ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, ఈ నెల 12వ తేదీ సోమవారం అల్లిపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని తెలిపారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేవదేవుని ఆశీస్సులతో ఖమ్మం నగరంలో స్వామివారి ఆలయం రూపుదిద్దుకోవడం ఎంతో సంతోషకరమని, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ బాధ్యత పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌తో పాటు ఖమ్మం నగరంలోనూ టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు వివరించారు.
భక్తిభావం ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేయాలని, పూజా కార్యక్రమాలకు అవసరమైన విస్తృత ఏర్పాట్లు చేపట్టి ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తిరుమలలో అనుసరించే విధానాలను ఆదర్శంగా తీసుకుని భక్తుల రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని, రద్దీ నియంత్రణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూమిపూజకు ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ నాణ్యమైన భోజనం, పులిహోర అందేలా దూరంగా భోజన కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రసాద పంపిణీ కౌంటర్లు పెంచాలని తెలిపారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటి కేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
భక్తుల రాకపోకలకు అనుగుణంగా నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలను గుర్తించి, మ్యాప్‌లతో సహా ముందుగానే సమాచారం ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. పుష్కరాల తరహాలో వైద్య సేవలు, అగ్నిమాపక వాహనాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జనరేటర్లను సిద్ధం చేయాలని చెప్పారు. నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, పాత్రికేయులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ భూమిపూజ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరగడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లకు పోలీస్ శాఖ తరఫున సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ, కార్యక్రమం ముగిసే వరకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ప్రజాప్రతినిధులు, టీటీడీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.








